- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఎవరికి దక్కేనో?
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ దగ్గర పడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి పెరిగిపోతున్నది. ఇండియా, న్యూజీలాండ్ జట్లు రెండూ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నవే. ఇటీవల ఈ రెండు జట్ల ఫామ్ చూస్తే బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనపడుతున్నాయి. అయితే చరిత్రలో తొలి సారిగా ఈ రెండు జట్లు ఒక తటస్థ వేదికపైన టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇది వరకు తటస్థ వేదికలపై వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఉన్నది. కానీ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆడలేదు. అయితే గత రికార్డులను పరిశీలిస్తే టీమ్ ఇండియాదే పై చేయిగా కనిపిస్తున్నది. గత కొన్నేళ్లుగా న్యూజీలాండ్ జట్టు టెస్టు క్రికెట్‌లో అంచనాలను మించి రాణిస్తున్నది. కానీ ఎక్కువగా స్వదేశంలోనే విజయాలు సాధించింది. అదే సమయంలో టీమ్ ఇండియా టెస్ట్ జట్టు అపురూపమైన విజయాలు అందుకున్నది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లు నెగ్గింది. అదే సమయంలో స్వదేశంలో కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నది.
ఇండియాదే పై చేయి..
ఇండియా, న్యూజీలాండ్ మధ్య టెస్ట్ రికార్డులనుపరిశీలిస్తే భారత జట్టుతే పై చేయిలా కనపిస్తున్నది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 59 టెస్ట్ మ్యాచ్‌లు జరుగగా.. ఇండియా 21 టెస్టుల్లో, న్యూజీలాండ్ 12 టెస్టుల్లో గెలిచింది. 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ కివీస్ జట్టుపై అత్యధిక పరుగులు చేశాడు. మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్ 63.80 సగటుతో 1659 పరుగులు చేశాడు. కివీస్‌పై 6 సెంచరీలు నమోదు చేశాడు. ఇక కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 10 మ్యాచ్‌లలో 68 సగటుతో 1224 పరుగులు చేశాడు. మొత్తం నాలుగు సెంచరీలు చేయగా.. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఆడుతున్న వారిలో టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కివీస్‌పై 51 సగటుతో 773 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. కివీస్ బ్యాట్స్‌మాన్ రాస్ టేలర్ 33 సగటుతో 812 పరుగులు చేశాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే కివీస్ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హాడ్లీ 22.96 సగటుతో 65 వికెట్లు తీశాడు. టీమ్ ఇండియా బౌలర్ బిషన్ సింగ్ బేడీ 12 టెస్టులు ఆడి 19.14 సగటుతో 57 వికెట్లు తీశాడు. డబ్ల్యూటీసీ ఆడుతున్న బౌలర్లలో టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కివీస్ మీద 16.97 సగటుతో 48 వికెట్లు తీశాడు. కివీస్ పేసర్ టిమ్ సౌథీ 8 టెస్టుల్లో 24.46 సగటుతో 39 వికెట్లు తీశాడు.
సౌతాంప్టన్ పిచ్ ఎలా ఉన్నది?
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు మంచి స్వింగ్‌ను అందిస్తుంది. అదే విధంగా స్పిన్నర్లు కూడా ఈ పిచ్‌పై మంచి టర్న్ రాబట్ట వచ్చని గత మ్యాచ్ రికార్డుల ఆధారంగా విశ్లేషకులు చెబుతున్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడం మంచిదని వారు అంటున్నారు. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించినా.. ఆ తర్వాత పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుందని చెబుతున్నారు. రెండు రోజుల తర్వాత ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం పూర్తి కష్టంగా ఉంటుందని.. ముఖ్యంగా 4,5వ రోజు స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలుస్తున్నది. ఇంగ్లాండ్‌లో ఉన్న అన్ని పిచ్‌ల కంటే సౌతాంప్టన్ రోజ్ బౌల్ పిచ్ ఉపఖండంలోని పిచ్‌ల మాదిరి ఉంటుందని సమాచారం. గత రికార్డులు పరిశీలిస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ స్కోర్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం వేసవి కాలమే నడుస్తున్నది. అయితే సాయంత్రం పూట మేఘాలు ఆవరిస్తున్నాయి. అలా మబ్బు పట్టినప్పుడు బౌలర్లకు అనుకూలంగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఓపికగా బ్యాటింగ్ చేస్తే తప్ప ఈ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు గెలవలేని పరిస్థితి.