‘‘నువ్వు భారతీయుడివి.. నీకు ఓటేయను’’.. భారత సంతతి నేతకు అమెరికాలో అవమానం

by Hajipasha |   ( Updated:2024-05-09 17:39:08.0  )
‘‘నువ్వు భారతీయుడివి.. నీకు ఓటేయను’’.. భారత సంతతి నేతకు అమెరికాలో అవమానం
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీపడి చివర్లో విరమించుకున్న వ్యాపారవేత్త వివేక్ రామస్వామి గుర్తున్నాడు కదూ!! తాజాగా ఆన్ కౌల్టర్ అనే రచయిత్రి నిర్వహించిన పోడ్ కాస్ట్ షోలో పాల్గొన్న వివేక్ రామస్వామికి అవమానం ఎదురైంది. వర్ణ వివక్షతో కూడిన దూషణలను ఆయన వినాల్సి వచ్చింది. ‘ది ట్రూత్’ పేరుతో నిర్వహించిన వివేక్ రామస్వామి పోడ్‌కాస్ట్ షోలో ఆన్ కౌల్టర్ మాట్లాడుతూ.. ‘‘మీరు రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారం చేయడాన్ని నేను గమనించాను. మీ ప్రసంగాలు చాలావరకు విన్నాను. మీరు చెప్పిన విషయాలు బాగా నచ్చాయి. అయినా నేను మీకు ఓటు వేయలేను. ఎందుకంటే మీరొక భారతీయుడు’’ అని వ్యాఖ్యానించింది. ఆన్ కౌల్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో షాక్‌కు గురైన వివేక్ రామస్వామి.. మర్యాదపూర్వకంగా ప్రతిస్పందించారు.

‘‘నా చర్మం రంగును బట్టి అమెరికాపై నా విధేయతను నిర్ణయించరు. అమెరికాను ద్వేషించే ఏడో తరం అమెరికన్ కంటే వలసదారులు, వారి పిల్లలకే ఈ దేశంపై బలమైన విధేయత ఉంటుంది’’ అని వివేక్ రామస్వామి కౌంటర్ ఇచ్చారు. ఈ సమాధానం విని నాలుక కరుచుకున్న ఆన్ కౌల్టర్.. తన వ్యాఖ్యలు జాతివివక్షను అద్దంపట్టేలా ఉన్నాయని గుర్తించింది. ‘‘అమెరికా అధ్యక్ష పదవి కోసం శ్రీలంక, జపాన్, భారత్‌కు చెందినవారిని తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం కాదు. మొదటి నుంచే వైట్ ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్స్ విలువలపై ఆధారపడి అమెరికా నడుస్తోంది. ఇకపైనా అమెరికా పాలనలో అదే తరహా మార్కు కొనసాగాలని నేను భావిస్తున్నా’’ అని ఆన్ కౌల్టర్ బదులిచ్చింది. అనంతరం ఈ పోడ్‌కాస్ట్‌కు సంబంధించిన పో‌స్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. కౌల్టర్ నిజాయితీపై వివేక్ ప్రశంసలు కురిపించారు. భారతీయుడివి కాబట్టి నీకు ఓటు వేయలేనని ఆమె మొహం మీదే చెప్పేయడం కరెక్టు కాదని అనిపించిందన్నారు.

Advertisement

Next Story