రఫాపై దాడులు ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం

by Hajipasha |
రఫాపై దాడులు ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైనిక దాడులను ఆపాలంటూ దక్షిణాఫ్రికా దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రపంచ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. రఫాపై సైనిక దాడిని ఆపేయాలని ఇజ్రాయెల్‌ను ఐసీజే ఆదేశించింది. ఒకవేళ ఈ దాడులు కొనసాగితే.. ఎంతోమంది సామాన్య పౌరుల ప్రాణాలు గాల్లో కలిసే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్ర ఆస్తినష్టం సంభవించే రిస్క్ కూడా ఉందని కోర్టు పేర్కొంది. రఫా నగరం ముట్టడిని ఆపేయాలని అల్టిమేటం జారీ చేసింది. ఈజిప్టు సరిహద్దులో ఉండే రఫా క్రాసింగ్ రోడ్డు మార్గాన్ని తెరిచి, గాజాలోకి నిత్యావసరాలు వెళ్లేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్‌కు ఐసీజే సూచించింది. కోర్టుకు చెందిన దర్యాప్తు అధికారులు రఫా నగరంలోకి వెళ్లి, అక్కడి పరిస్థితులపై విచారణ నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. ఈ తీర్పును ఐసీజేలోని మొత్తం 15 మంది జడ్జీలకుగానూ 13 మంది ఆమోదించారు. కేవలం ఉగాండా, ఇజ్రాయెల్ దేశాల న్యాయమూర్తులు వ్యతిరేకించారు.

Advertisement

Next Story