విమాన ప్రయాణంలో మహిళకు షాక్.. పక్క రాష్ట్రానికి బదులుగా పొరుగు దేశం వెళ్లిన విమానం!

by S Gopi |   ( Updated:2023-05-08 01:09:34.0  )
విమాన ప్రయాణంలో మహిళకు షాక్.. పక్క రాష్ట్రానికి బదులుగా పొరుగు దేశం వెళ్లిన విమానం!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఓ మహిళకు విమాన ప్రయాణంలో వింత అనుభవం ఎదురైంది. పక్క రాష్ట్రం వెళ్లేందుకు విమానం ఎక్కిన ఆమెను విమానం అనూహ్యంగా మరో దేశానికి తీసుకెళ్లింది. అసలు ఎంతో పకడ్బదీంగా పనిచేసే ఎయిర్ పోర్టులో ఈ పాస్ పోర్టు కూడా లేకుండా ఓ మహిళను వేరే దేశం తీసుకెళ్లే తప్పిదం జరిగిందంటే.. నమ్మకం కలగడం లేదు కదా!. కానీ ఇది నిజం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు మనకు తెలియకుండానే జరిగిపోతాయనే దానికి ఈ మహిళ విమాన ప్రయాణమే నిదర్శనం.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎల్లిస్-హబ్బార్డ్ తరచూ ఫిలడెల్ఫియా నుంచి జాక్సన్ విల్లె (ఫ్లోరిడా) నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది. జాక్సన్ విల్‌లో ఆమెకు ఓ సొంత ఇల్లు ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఆమె జాక్సన్‌విల్ వెళ్లేందుకు ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌లో టిక్కెట్ బుక్ చేసుకుంది. ప్రయాణ తేదీ రోజున ఎల్లిస్ ఎయిర్‌పోర్టుకు యథావిధిగా చేరుకుంది. తను ఎక్కాల్సిన విమానం.. గేట్ వద్ద సిద్ధంగా ఉంది. అయితే, విమానం బయలుదేరడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు ఎల్లిస్ బాత్రూంకు వెళ్లింది. తిరిగొచ్చేసరికి ప్రయాణికులు అంతా దాదాపుగా విమానం ఎక్కేశారు. దీంతో, గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను ఆదరాబాదరాగా విమానంలోకి పంపించేశారు. అయితే ఇక్కడే తప్పు జరిగిపోయింది.

అంతకు కొద్ది క్షణాల మునుపే, ఆమె ఎక్కాల్సిన విమానం మరో గేటుకు మార్చారు. ఈ విషయాలేవీ ఎల్లిస్‌కు తెలియవు. దీంతో, ఆ మహిళ మారిన విమానంలోకి వెళ్లి తన సీట్లో కులాసాగా కూర్చుంది. అయితే, కంగారుగా ఫ్లైట్ ఎక్కిన ఆమెకు లగేజీ సీటు పైన పెట్టుకునే క్రమంలో చేతికి చిన్న గాయం అయ్యింది. దానికి చికిత్స చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టస్ ఎల్లిస్‌తో కంగారు పడక్కర్లేదని, కొద్ది గంటల్లో మనం జమైకా దేశంలో దిగిపోతామని చెప్పింది. ఇది విన్న ఎల్లిస్.. ఎయిస్ హోస్టస్ జోక్ బాగా చేస్తోందని నవ్వుతూ.. నేను వెళ్లా్ల్సింది జమైకా కాదు జాక్సన్ విల్లె అని చెప్పింది. దీంతో, ఆమెవైపు సీరియస్‌గా చూసిన ఎయిర్ హోస్టస్ మనం నిజంగానే జమైకా వెళుతున్నామని చెప్పడంతో ఎల్లిస్ మతి పోయినంత పనైంది. అప్పటికి ఆమె వద్ద తన పాస్‌పోర్టు కూడా లేదు. దీంతో, జమైకా ఎయిర్‌పోర్టులో కాలు పెట్టలేని పరిస్థితి.

విమానం జమైకాలో ల్యాండయ్యాక అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎల్లిస్‌ను ఎయిర్‌పోర్టు గేటు, విమానానికి అనుసంధానంగా ఉండే జెట్‌ బ్రిడ్జి‌లోనే నిలిపేశారు. జెట్ బ్రిడ్జి అమెరికా పరిధిలోనిదే కావడంతో పాస్‌పోర్టు లేకపోయినా ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆ తరువాత కొద్ది గంటలకు మరో విమానంలో ఆమె ఫిలడేల్ఫియాకు చేరుకుంది. కాగా, ఈ ఘటనపై మహిళకు ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పింది. ఆమె టిక్కెట్ డబ్బులను తిరిగి చెల్లించడమే కాకుండా పరిహారం కింద 600 డాలర్ల విలువైన గిఫ్ట్ వోచర్‌ను కూడా ఇచ్చింది. ఈ సంఘటన తన జీవితంలో మరిచిపోలేనని ఎల్లిస్ ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్‌వ్యలో చెప్పింది.

Also Read: King Charles Coronation : పట్టాభిషేక కార్యక్రమంలో అపశ్రతి.. అదుపుతప్పిన గుర్రం ఏం చేసిందో చూడండి!

Advertisement

Next Story