బైడెన్ ఖచ్చితంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోరు: వైట్‌హౌస్

by Harish |   ( Updated:2024-07-04 03:42:29.0  )
బైడెన్ ఖచ్చితంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోరు: వైట్‌హౌస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్‌‌లో జరగబోయే ఎన్నికల నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై వైట్‌హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పియర్ స్పందించారు. ఆయన ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఉపసంహరించుకునే ఉద్దేశ్యం బైడెన్‌కు "ఖచ్చితంగా" లేదని, ఆయన స్పష్టమైన దృష్టితో ఉన్నారు, అధ్యక్ష రేసు నుంచి తప్పుకోరని ఒక విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో బైడెన్ వయస్సు పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మతిమరుపు కూడా వచ్చిందని కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్‌- బైడెన్‌ మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చలో మాట్లాడుతూ, బైడెన్‌ కొన్ని సార్లు తడబాటుకు గురయ్యారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో బైడెన్ తన ప్రత్యర్థిని ఎదుర్కొవడంలో ఇబ్బందులు పడటం డెమోక్రాటిక్‌‌ పార్టీలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రేసు నుంచి తప్పుకుని మరొకరికి అవకాశం ఇస్తారని, ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా ట్రంప్‌కు బలమైన పోటీగా ఉంటారని నివేదికలు వచ్చాయి. ఈ క్రమంలో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవడం లేదని వైట్‌హౌస్ పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story