- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Special Story : WORLD WAR-lll.. ప్రపంచాన్ని కమ్మేస్తున్న యుద్ధ మేఘాలు
యుద్ధం అనేది మానవాళికి కొత్తమీ కాదు.. కానీ ఈ తరానికైతే ఇది ఒకింత కొత్తదే.. యుద్ధాల గురించి పుస్తకాల్లో చదవడమే గానీ ప్రత్యక్షంగా చూసింది లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది కాలంగా పశ్చమాసియా దేశాల్లో రోజూ బాంబుల వర్షమే.. సంవత్సరాల గడుస్తున్న ఉక్రెయిన్-రష్యా మధ్య క్షిపణుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా రష్యాకు వార్నింగ్ ఇవ్వడం, చైనా అమెరికాకు చురకలంటించడం, అమెరికా ఇరాన్ కు వార్నింగ్ లు ఇవ్వడం, తరచూ ఉత్తర కొరియా సైనిక బల ప్రదర్శనలు కొనసాగించడం, ఇవే కాకుండా చాలా దేశాలు తమ శత్రు దేశాలతో అడపదడపా సవాల్లు విసురుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ గమనిస్తే రెండు ప్రపంచ యుద్ధాల గురించి చదివిన వారందరికీ ఇప్పుడు కొనసాగుతున్న ఈ ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపుతాయా అనే సందేహం నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధమనేది అంతా ఈజీ అయితే కాదు గానీ ఇజ్రాయిల్-పాలస్తీనా గొడవల్లో గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే, అమెరికా, రష్యా, చైనా లాంటి కొన్ని పెద్ద దేశాలు ప్రత్యక్షంగా పాల్గొంటే మాత్రం world war-3 తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. - గోపు రాజు
రష్యా-ఉక్రెయిన్ వార్
చాలా కాలం నుండి రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ యుద్ధం వరకు వెళ్లదని అందరూ అనుకున్నారు. కానీ ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్ యూనియన్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ డిమాండ్‌ని అగ్రరాజ్యం అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలా అయితే ఉక్రెయిన్ విషయంలో తాము తగ్గేదే లేదంటూ ఏకంగా ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించడంతో యుద్ధం మొదలైంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా ఇందులో జోక్యం చేసుకోవద్దంటూ గట్టి సంకేతాలే పంపాడు. దీంతో 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది. అప్పుడు మొదలైన యుద్ధం దాదాపు ఇప్పటికీ 31 నెలలు గడుస్తున్న ఇంకా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు.
ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యా అభ్యంతరమేంటీ?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటో. దీని లక్ష్యం వాస్తవంగా.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణను అడ్డుకోవటం. ఈ కూటమి దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా దాడి జరిగినట్లయితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. ప్రస్తుతం నాటో దేశాల సంఖ్య 32కి చేరింది. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కాదు కానీ ‘భాగస్వామ్య దేశం’గా ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వవచ్చుననే అవగాహన కుదిరింది. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా నాటోలో చేరాలనుకుంటుంది. కానీ దీన్ని రష్యా అడ్డుకుంటుంది. కారణమేంటంటే తూర్పు యూరప్ లో విస్తరించేందకు అమెరికా నాయకత్వంలో నాటో కూటమి కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. తమ ఇరుగు పోరుగు దేశాల్లో కూడా నాటో కూటమి ఆయుధాలను మొహరించడం, రష్యాకు మరింత కోపం తెప్పించింది. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా కూటమిలో చేరితే తమపై ఆధిపత్యం చేయడానికి నాటో కూటమికి మార్గం మరింత సులభతరమైతుందని రష్యా భావిస్తోంది. ముఖ్యంగా అమెరికా నుంచి ఎప్పటికైనా ముప్పు వాటిల్లుతుందని రష్యా వ్యతిరేకిస్తుంది.
1991లో సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ నుంచి విడిపోయింది. విడిపోయినప్పటికీ రష్యా సాంస్కతిక, సామాజిక అంశాలు ఇంకా ఉక్రెయిన్ లో కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు ఉక్రెయిన్ కు ఉన్న రెబెల్స్ కి రష్యా భాసటగా నిలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటో కూటమితో దొస్తనా చేయాలని నిర్ణయించుకుందో అప్పటి నుంచి రష్యా దీన్ని వ్యతిరేకిస్తు వస్తోంది.
ఎందుకంటే ఉక్రెయిన్ వేదికగా అమెరికా చేసే ఏ ప్రయోగాలన్న తమకు వ్యతిరేకంగానే చేస్తారని రష్యా భావిస్తోంది.
గొడవకు 2 బలమైన కారణాలు
1.నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదు.
2. ఉక్రెయిన్ భూభాగంలో నాటో కూటమి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదు
ఇరుదేశాల్లో భారీ నష్టం
రష్యా దాడులు.. ఉక్రెయిన్ ప్రతి దాడులతో ఇది భీకర యుద్ధంగా మారింది. ఇరువైపులా వేలాదిగా సైనికులు, సాధారణ పౌరులు మరణించగా.. అంత కంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. లెక్కలెనన్ని ఆకలి చావులు. మరణాల సంఖ్యపై రెండు దేశాలు అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో, మృతిచెందిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. కాగా, యుద్ధంలో రష్యా వైపు 12,000 మంది సైనికులు మరణించగా.. దాదాపు 3,50,000 మంది గాయపడినట్లు గణంకాలు చెబతున్నాయి. అదేవిధంగా 80,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించగా.. దాదాపు 4,00,000 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.
ప్రపంచ దేశాలపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడింది. ప్రపంచ వాణిజ్యం ప్రభావితమైంది. ప్రధానంగా ఆహార కొరత, ధరలు పెరిగాయి. ఇంధన మార్కెట్లు దెబ్బతిన్నాయి. రెండు దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో అన్నింటీ ధరలు ఆకాశాన్నంటాయి. ఇంధన ధరలు విపరీతంగా పెరుగడంతో పాటు ఆహార కొరత ఏర్పడింది. మరోవైపు యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు రష్యాపై పలు రకాల ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా పలు చర్యలు తీసుకొన్నది. దీంతో ప్రధానంగా రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడే ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
పాలస్తీనా-ఇజ్రాయెల్ వార్..
పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలై ఏడాది గడుస్తున్న అక్కడి పరిస్థితులు మాత్రం రోజు రోజూకీ మరింత తీవ్రతరం అవుతున్నాయి. హమాస్ దాడితో మొదలైన ఈ సంఘర్షణ ఆ తర్వాత గాజా స్ర్టిప్ దాటి, లెబనాన్, సిరియా, ఇరాన్ వరకు విస్తరించింది. రోజురోజూకి యుద్ధంలో ఇంకో దేశం భాగస్వామ్యం అవుతుందే తప్ప విరమణకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఏడాది కాలంగా ఆరని చిచ్చులా ఈ యుద్ధం కొనసాగుతోంది. అక్టోబరు 7న 2023 'సింహత్ తోరా' సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి ఇజ్రాయెలీలందరూ సిద్దమై ఉండగా హమాస్ మిలిటెంట్లు ఆ దేశంపై 4300కు పైగా రాకెట్ల వర్షం కురిపించారు! కొంతమంది మిలిటెంట్లు వాహనాల్లో భూమార్గాన.. మరికొందరు పారా గైడర్ల సాయంతో గగనతలం గుండా.. సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి చొరబడి దొరికినవారిని దొరికినట్టు చంపేసి ఊచకోత కోశారు! దాదాపు 7000 మంది మిలిటెంట్లు 119 చోట్ల సరిహద్దులను దాటి విధ్వంస కాండ కొనసాగించారు. వారి దాడుల్లో 1139 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు బందీలుగా గాజా స్ట్రిప్కు తీసుకెళ్లిపో యారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ ఏడాదికాలంగా చేస్తున్న యుద్ధంలో 40వేలకు పైగా మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు.
గొడవలకు కారణాలు..
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా ప్రధాన ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు పాత జెరూసలెంలో ఉండే అల్-అఖ్సా మసీదును అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రస్థలాల్లో అల్-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్‌మౌంట్‌గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్‌మౌంట్ అత్యంత పవిత్రస్థలం.
ఈ పవిత్రస్థల విషయంలోనే చాలా ఏండ్ల పాటు వీళ్ల మధ్య గొడవలు కొనసాగాయి. ఈ తర్వాత 1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య.. ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్-అఖ్సా విషయంలో యధాతథస్థితి కొనసాగించాలని నిర్ణయించారు. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా.. యూదులు, క్రైస్తవులకు అనుమతించరు. వారు కేవలం.. ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతుంది. అల్-అఖ్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ.. చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక యూదు మతసంస్థలు.. తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్-అఖ్సా ప్రాంగణంలో.. ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి. కొద్దిరోజులు కిందట ఇజ్రాయెల్ భద్రతాదళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో.. అల్-అఖ్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారి తీసింది.
హమాస్ అంటే?
పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో హమాస్ ఒకటి. పాలస్తీనాలో వెస్ట్ బ్యాంక్, గాజాలు ఉండగా గాజాలో హమాస్ బలంగా ఉంది. దీన్ని 1980ల్లో షేక్ అహ్మద్ యాసిన్ నెలకొల్పారు. 1987లో ఇజ్రాయెల్ చేస్దున్న ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ సమయంలో హమాస్ వెలుగులోకి వచ్చింది. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, నాటి ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ పాలన ఏర్పడింది. అయితే దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత హమాస్ ఉగ్రచర్యలకు పాల్పడటంతో 1997లో అమెరికా ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
హమాస్‌కు తోడుగా హెజ్ బొల్లా..
హమాస్ ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగి హమాస్ ను దాదాపు మట్టుబెడుతున్న క్రమంలో మరో ఉగ్రవాద సంస్థ హెజ్బల్లా ఇజ్రాయెల్ పక్కలో బల్లెంలా తయారైంది. గాజా ప్రాంతంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడం, భూతల దాడులు చేసి హమాస్ నేతలను ఇజ్రాయెల్ ఊచకోత కోసింది. ఈ పరిణామం తర్వాత హమాస్కు మద్దతిస్తూ.. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్ బొల్లా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్ కేంద్రంగా పని చేస్తున్న హెజ్ బొల్లాపై కేంద్రీకరించింది.
ఈ రెండింటికి తోడుగా ఇరాన్..
హమాస్ ను ఖతం చేసి హెజ్ బొల్లాను మట్టుబెట్టే క్రమంలో ఇజ్రాయెల్ మొదట వాళ్ల స్థావరాలపై వైమానిక దాడులు చేసి, ఆ తర్వాత భూతల దాడులూ చేస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, మరికొంత మంది కీలక నేతలు మరణించిన తర్వాత.. పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. అప్పటి వరకు హమాస్, హెజ్ బొల్లా సంస్థలకు పరోక్షంగా మద్దతిస్తూ వచ్చిన ఇరాన్.. హమాస్, హెజ్బోల్లా కీలక నేతల చనిపోవడం, ఇరాక్ చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోబోతుందని నిఘా వర్గాల సమాచారం మేరకు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగింది.
ఇరాన్ రాకతో మరింత ఉద్రిక్తత
హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణిలతో దాడులకు దిగింది. అయితే, అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్లతో వీటిని ఎదుర్కొంది. అయినా క్షిపణుల దాడితో ఇజ్రాయిల్ లో కొంతమేర నష్టం వాటిల్లింది. దీనిపై రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి కోసం వ్యూహరచన చేస్తోంది. మరోవైపు అమెరికా లాంటి అగ్రదేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ దాడిని ఖండించని దేశాలు మాకు శత్రువలే అంటూ ప్రకటించేశాయి. ఏకంగా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు గుటెరస్ ను తమ దేశంలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చిరికలు కూడా జారీ చేసింది. కానీ ఇరాన్ చమురుక్షేత్రాలపై మాత్రం దాడి చేయొద్దని అమెరికా హింట్ ఇచ్చింది. కానీ మాకున్న సమాచారం మేరకు ఇజ్రాయిల్ మా చమురు క్షేత్రాలే లక్ష్యంగా దాడులు జరగబోతున్నాయని ఇరాన్ వెల్లడించింది. ఏ క్షణమైన ఇరాన్ పై దాడి జరిగొచ్చని ఇజ్రాయెల్ హెచ్చిరకలు జారి చేస్తోంది. ఇదే గాని జరిగితే యుద్ధం తన రూపాన్ని మార్చుకుని మరింత విస్తరించడం ఖాయం. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధ భయాలు పెరిగేలా కనిపిస్తున్నాయే తప్ప.. ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్ని దేశాలు వీరి మధ్య సంధి కూదుర్చాలని ప్రయత్నించిన ఇరు దేశాల్లో ఏదో ఒకటి తిరస్కరిస్తూనే ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రాంతీయ యుద్ధంగా మారింది. తాడోపేడో తేల్చుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ ప్రభావం
ఇప్పటి వరకు చిన్న దేశాలతో కొనసాగుతున్న యుద్ధంలో ప్రత్యక్షంగా అమెరికా, రష్యా, చైనా దిగితే మాత్రం కచ్చితంగా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. ఇలా జరిగితే కొన్ని దేశాలైతే దివాలా తీసే పరిస్థితి. భారత్ పై కూడా చమురు ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా దేశాలకు చమురు ఈ గల్ఫ్ కంట్రీస్ నుండే సరఫరా అవుతుంది. చైనాకు కూడా ఇక్కడి నుండే భారీ ఎత్తున చమురు సరఫరా జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికీ ఇరాన్ కు చెందిన చముర కేంద్రాలపై దాడే ఆలోచన ఉన్నట్లు వార్త కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ అతి దగ్గరల్లో ఉన్న పర్షియన్ గల్ఫ్ లో ఇతర దేశాలైన బహ్రయిన్, ఖతార్, కువైత్, ఇరాక్, సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ ఈ తీరప్రాంతంలోనే ఉన్నాయి. హెర్ముజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్ కి ప్రవేశించాల్సివుంటుంది. ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ ఆధీనంలో ఉంటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదు. ఇదే గాని జరిగితే ఒక్కసారిగా 5 శాతం చమురుధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురుసంస్థల అంచనా వేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే అటోమెటిక్ గా అన్నింటీ ధరలు పెరుగుతాయి. ఇవే కాకుండా గ్లోబల్ మార్కెట్లు కూడా పతనమవుతాయి. ఇవే కాకుండా యుద్ధ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా జరుగుతున్నాయి.
అరబ్ కంట్రీస్ ఏకమైతే వరల్డ్ వార్‌కు ఛాన్స్..
ఇరుదేశాల మధ్య శాంతి పునరుద్ధరణ జరగాలని కొన్నిదేశాలు విజ్ఞప్తుల చేస్తుంటే, మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని తప్పబడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా క్యూ కడుతున్నాయి. 1948 నుంచే అమెరికా ఇజ్రాయెల్ కు మద్ధతుగా నిలుస్తు వస్తోంది. జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ కూడా హమాస్‌ని విమర్శిస్తూనే ఇజ్రాయెల్‌కి మద్దతుగా నిలుస్తున్నాయి. మరోవైపు అరబ్ దేశాలు హమాస్‌ను సమర్థిస్తున్నాయి. ఇజ్రాయిల్ -గాజాతో మైదలైన పోరులో గాజా(హమాస్) కు తోడుగా లెబనాన్(హజ్బోల్లా), సిరియా, యెమన్(హౌతీ), వెస్ట్ బ్యాంక్ లోని ఉగ్రవాదులు, ఇరాన్, ఇరాక్, సిరియాకు చెందినటువంటి షియా మిలిటెంట్లు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు అరబ్ కంట్రీస్ అయినటువంటి ఖతర్, బెహ్రీన్, కువైట్, ఓమన్, దుబాయ్, సౌదీ, ఇరాక్ తో పాటు ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమినే పిలుపునిచ్చారు. ఇదే గాని జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్లే.
వీళ్ల మధ్య కూడా వైరాలు.
ఇవే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా దేశాల మధ్య కూడా అడపదడప దాడులు, హెచ్చరికలు, కవ్వింపులు, సైనిక బల ప్రదర్శనలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న దేశాలున్నాయి. వీటిలో ప్రధానంగా ఉత్తరకొరియా దక్షిణకొరియా, అమెరికా మీద హెచ్చరికలు జారీచేస్తూ క్షిపణి ప్రయోగాలను చూస్తూ తమ సామార్థాన్ని చూపెడుతుఉంటుంది. భారత్-పాక్ దేశాల మధ్య ఉగ్రవాద సమస్య, భూభాగం అక్రమించడం వంటి సమస్యలున్నాయి. చైనా-భారత్ మధ్య కూడా భూభాగం విషయంలో తరుచూ వ్యాఖ్యలు జరుగుతున్నాయి. చైనా-తైవాన్ మధ్య కూడా గొడలున్నాయి. చైనా-అమెరికా మధ్య కూడా వైరం నడుస్తోంది. ఉక్రెయిన్ కు సపోర్టు చేస్తున్న ప్రతి దేశాన్ని రష్యా శత్రువుగానే భావిస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా అదే తరహాలో ముందుకు వెళ్తోంది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు ఈ యుద్ధంలో కూడా వెనుక నుండి సాయం చేస్తుండటంతో గమ్యం తెలియని యుద్ధంలా కొనసాగేలా ఉంది.