కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలి

by Kalyani |
కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలి
X

దిశ,రాంనగర్ : మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత ప్రభుత్వం- సీపీఐ (మావోయిస్టు) పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ఫీస్ డైలాగ్ కమిటీ (శాంతి చర్చల కమిటీ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ అడ్వకేట్ బేల బాటియా, చెరుకు సుధాకర్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మధ్య భారతంలో జరుగుతున్న యుద్దాన్ని వెంటనే నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం సీపీఐ (మావోయిస్టు) పార్టీతో బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా మావోయిస్టుల నెపంతో ఆదివాసీలు జీవించే హక్కునే హరిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టాలని కోరారు. చత్తీస్ ఘడ్ మారణకాండపై ఆదివాసీ, హక్కుల సంఘాలు, పౌర, ప్రజాస్వామిక సంఘాల రిపోర్టులు ఆధారంగా సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారతదేశంలో రగులుతున్న హింసాకాండకు గల కారణాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి నాయకత్వంలో మణిపూర్ కు వెళ్లారు కానీ, హింసతో రగులుతున్న దండ కారణ్యంలోని బస్తీర్ సందర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షకులు ప్రతికారచర్యకు భయపడకుండా అన్ని పరిమితుల నుంచి విముక్తి లేకుండా వారి చట్టపరమైన మానవ హక్కుల కోసం కృషి చేయాలన్నారు. యువత గిరిజన మహిళపై జరుగుతున్న అక్రమ దాడులను వ్యతిరేకించాలన్నారు. ఒకవేళ యుద్ధ వాతావరణం ఆపకుండా శాంతి చర్చలు జరుపుతే అమాయక ఆదివాసులు బలవుతున్నారని, అదేవిధంగా కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాబట్టి అమాయక ప్రజలు బలవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను కలిసి శాంతియుత చర్చలు జరిపి ఆదివాసుల మారణ హోమాన్ని ఆపాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, కందిమల్ల ప్రతాపరెడ్డి, జర్నలిస్టు దుర్గాప్రసాద్, మాజీ మావోయిస్టు సీసీఎం జంపన్న, ఎం వి ఎస్ ఫౌండేషన్ ఆర్ వెంకట్ రెడ్డి, రచయిత అనిశెట్టి సాయి కుమార్, జి .రాములు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed