'చైనా వద్దు.. ఇండియా ముద్దు'

by Vinod kumar |
చైనా వద్దు.. ఇండియా ముద్దు
X

వాషింగ్టన్ : కమ్యూనిస్టు చైనాపై ఆధారపడొద్దంటే.. భారత్‌తో బలమైన బంధమే అమెరికాకు ఏకైక మార్గమని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి అన్నారు. డ్రాగన్‌ నుంచి అమెరికా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందాలంటే భారత్‌తో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ప్రత్యేకించి అండమాన్‌ సముద్ర జలాల్లో భారత్‌తో సైనిక బంధం అవసరమని వివేక్ అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తే.. అత్యవసర సమయాల్లో మలక్కా జల సంధి వద్ద చైనా నౌకలను అడ్డుకునేందుకు లైన్ క్లియర్ అవుతుందని పేర్కొన్నారు. మలక్కా జల సంధి మీదుగానే చైనాకు చాలావరకు ఇంధన సరఫరా జరుగుతుంటుందన్నారు. తాను ప్రెసిడెంట్‌ను అయితే ఈవిధంగానే పాలసీలకు రూపకల్పన చేస్తానని వివేక్ స్పష్టం చేశారు. భారత్‌కు నరేంద్రమోడీ సరైన నాయకుడని కొనియాడారు. దేశ ప్రయోజనాలను కాపాడలేకపోవడమే అమెరికా ఫారిన్ పాలసీకి అతిపెద్ద సవాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story