ఒలింపిక్స్‌కు ముందు పారిస్ ప్రఖ్యాత స్టోర్‌లో UPI సేవలు స్టార్ట్

by Harish |
ఒలింపిక్స్‌కు ముందు పారిస్ ప్రఖ్యాత స్టోర్‌లో UPI సేవలు స్టార్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలో చెల్లింపుల పరంగా కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు, పారిస్‌లోని హౌస్‌మన్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఫ్లాగ్‌షిప్ స్టోర్ ‘గ్యాలరీస్ లఫాయెట్‌’లో ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత యూపీఐని అక్కడి స్టోర్‌లో ప్రారంభించడం ద్వారా దీని సేవలను గ్లోబల్‌గా విస్తరించడానికి అవకాశం లభిస్తుంది. భారతీయ సందర్శకుల కోసం లావాదేవీలను సులభతరం చేయడానికి యూపీఐ అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం పారిస్‌లో UPI ప్రారంభించిన చిత్రాలను సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

అంబాసిడర్ జావేద్ అష్రఫ్ ప్రపంచ ప్రఖ్యాత గ్యాలరీస్ లఫాయెట్‌లో ఒక వస్తువును కొనుగోలు చేసి యూపీఐ ద్వారా మొదటిసారి చెల్లింపులు చేసి సేవలను ప్రారంభించారు. అంతకుముందు ఫ్రాన్స్‌లో జనవరి 2024లో మొట్టమొదటి సారిగా ఈఫిల్ టవర్‌లో యూపీఐని ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా దేశం అంతటా సేవలను వేగంగా విస్తరిస్తున్నారు. ఇకపై ఐకానిక్ వండర్ ఈఫిల్ టవర్‌ని సందర్శించినా లేదా గ్యాలరీస్ లఫాయెట్‌లో షాపింగ్ చేసినా, చెల్లింపులు చేయడానికి ఎవరైనా నేరుగా UPIని ఉపయోగించవచ్చు.

భారత డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని ప్రపంచీకరణ చేయాలనే పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ దార్శనికతకు ఈ చర్య పొడిగింపుగా పరిగణించబడుతుంది. జులై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ప్రపంచ ప్రఖ్యాత స్టోర్‌లో UPIని ప్రవేశపెట్టడానికి లైరా-NPCI మధ్య ఒప్పందం కుదరడం అది వేగంగా పూర్తి కావడాన్ని అష్రఫ్ స్వాగతించారు. UPI అనేది సరిహద్దులను దాటి ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తుంది. త్వరలో అన్ని దేశాలు కూడా UPI డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story