Typhoon Yagi: వియత్నాంలో యాగి తుపాన్ బీభత్సం.. 82కు చేరిన మృతుల సంఖ్య

by vinod kumar |
Typhoon Yagi: వియత్నాంలో యాగి తుపాన్ బీభత్సం.. 82కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: యాగి తుపాన్‌తో వియత్నాం విలవిల లాడుతోంది. ఈ తుపాన్ కారణంగా ఇప్పటివరకు 82 మంది ప్రాణాలు కోల్పోయినట్టు విపత్తు నిర్వహణ అధికారులు మంగళవారం వెల్లడించారు. మరో 64 మంది గల్లంతు కాగా..752 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగానే మరణాలు సంభవించాయని తెలిపారు. ఇళ్లు, పారిశ్రామిక కేంద్రాలు, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతిన్నట్టు చెప్పారు. ఈ నెల 7న తుపాన్ ప్రారంభం కాగా భారీ వర్షాలు కురిశాయి. దీని ప్రభావం వల్ల ఉత్తర వియత్నాంలో అధికంగా వరదలు రావడంతో పాటు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

తుపాన్ కారణంగా ఉత్తర ప్రావిన్స్ ఫుథోలోని ఎర్ర నదిపై 30 ఏళ్ల నాటి వంతెన సోమవారం కుప్పకూలగా ఎనిమిది మంది తప్పిపోయారు. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 4,600 మంది సైనికులను సహాయక చర్యల నిమిత్తం ఉత్తర ప్రావీన్సులో మోహరించారు. గత 30 ఏళ్లలో వియత్నాంలో వచ్చిన అత్యంత విధ్వంసకర తుపాను ఇదేనని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed