దూసుకెళ్తున్న ట్రంప్: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజ

by samatah |
దూసుకెళ్తున్న ట్రంప్: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే తొలి విజయం సాధించిన ట్రంప్ తాజాగా మరోసారి గెలుపొందాడు. న్యూ హ్యాంప్‌షైర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని ఓడించారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ మరింత చేరువయ్యాడు. అయితే, న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన మూడు రిపబ్లికన్ ప్రైమరీలలో ట్రంప్ విజయం సాధించినప్పటికీ 2016లో హిల్లరీ క్లింటన్, 2020లో జో బైడెన్ చేతిలో సాధారణ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: నిక్కీ హేలీ

న్యూహ్యాంప్ షైర్‌లో ఓటమి అనంతరం నిక్కీ హేలీ మీడియాతో మాట్లాడారు. రేసు ఇంకా ముగియలేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంకా అనేక రాష్ట్రాలు మిగిలి ఉన్నాయని తెలిపారు. తదుపరిగా నాకు ఇష్టమైన సౌత్ కరోలినా ఉంది. అక్కడ తప్పకుండా విజయం సాధిస్తా అని తెలిపారు. 2011-17 మధ్య సౌత్ కరోలినా నుంచి నిక్కీ హేలీ గవర్నర్‌గా పని చేశారు. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇంకా తమ ఓటు వేయలేదని తెలిపారు. కాగా, గతంలో అయోవా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ ట్రంప్ విజయం సాధించారు. దీని తర్వాత వివేక్ రామస్వామి, రాన్ డి-శాంటీస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

డెమోక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ గెలుపు!

మరోవైపు న్యూ హాంప్‌షైర్‌లో డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గెలుపొందినట్టు తెలుస్తోంది. బైడెన్‌కు 66.8 శాతం ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన డీన్ ఫిలిప్స్‌కు కేవలం 20శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో బైడెన్ పేరు లేకపోయినా భారీ విజయం సాధించడం గమనార్హం. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed