Tribes clashes: గిరిజన తెగల మధ్య ఘర్షణ..36 మంది మృతి

by vinod kumar |
Tribes clashes: గిరిజన తెగల మధ్య ఘర్షణ..36 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాయువ్య ప్రాంతంలోని గిరిజన జిల్లాలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన ఘర్షణలో 36 మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా కుర్రం జిల్లాలోని బోషెరా గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ భూభాగం కోసం రెండు గిరిజన సమూహాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకోగా 36 మంది మరణించగా..మరో 162 మందికి గాయాలైనట్టు డిప్యూటీ కమిషనర్‌ కుర్రం జావేదుల్లా మెహసూద్‌ తెలిపారు.

ఘర్షణలు పీవార్, తాంగీ, బతలిష్‌ఖేల్, ఖార్ కలే, మక్బాల్, కుంజ్ అలీజాయ్, పారా చమ్కాని, కర్మన్‌తో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్టు పేర్కొన్నారు. ప్రత్యర్థులు భారీ అధునాతన ఆయుధాలను ఒకరిపై ఒకరు ఉపయోగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. అయితే బోషెరా, మలిఖేల్. దండార్ ప్రాంతాల్లో షియా, సున్నీ తెగల మధ్య పోలీసులు సంధి కుదిర్చినట్టు తెలుస్తోంది. పోరాట బృందాల మధ్య సంధి ఉన్నప్పటికీ, జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed