US Election: అందుకే అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న.. తొలిసారి బైడెన్ ప్రసంగం..

by Harish |
US Election: అందుకే అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న.. తొలిసారి బైడెన్ ప్రసంగం..
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇటీవల ప్రసంగంలో వివరించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత బుధవారం తొలిసారి బైడెన్ అమెరికన్లతో మాట్లాడుతూ, డెమోక్రటిక్‌ పార్టీని, దేశాన్ని ఏకం చేయడానికి, అలాగే తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించి 2024 ఎన్నికల నుండి తప్పుకున్నట్లు చెప్పారు.

బైడెన్ తన ప్రసంగంలో అమెరికా రాజకీయాల్లో విభజనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశం, నియంత లేదా నిరంకుశల కంటే శక్తివంతమైనదని, కొత్త తరాలకు ఇక్కడ మాట్లాడటానికి సమయం, స్థలం ఉందని చెప్పారు. ఆరోగ్యం, ఇతర కారణాల రీత్యా రాబోయే ఆరు నెలలు క్రియాశీలకంగా పనిచేయరని వస్తున్న వార్తలను బైడెన్ కొట్టి పారేశారు. తన పదవిలో ఉన్నంత కాలం ఆర్థిక వ్యవస్థ, కీలకమైన విదేశాంగ విధాన సమస్యలపై పని చేస్తూనే ఉంటానని నొక్కి చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో అధ్యక్షుడిగా పని చేయడంపై దృష్టి పెడతాను అని స్పష్టం చేశారు.

గత కొంత కాలంగా బైడెన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బయటి నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయితే తాను పోటీ నుంచి తప్పుకోనని పలు మార్లు ప్రకటించినప్పటికీ పరిస్థితులు మరింత కఠినంగా మారడంతో రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనకు బదులుగా డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అధ్యక్ష రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. బైడెన్ ఉపసంహరణతో ఇప్పుడు 78 ఏళ్ల ట్రంప్‌ అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అభ్యర్థిగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed