అమెరికా అధ్యక్ష రేసులో మళ్లీ ఆ ఇద్దరే!

by samatah |
అమెరికా అధ్యక్ష రేసులో మళ్లీ ఆ ఇద్దరే!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ ట్యూస్ డే సందర్భంగా16 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ట్రంప్ మొత్తం 11 రాష్ట్రాల్లో గెలుపొందాడు. వర్జీనియా, మిన్నెసోటా, కొలరాడో, టెక్సాస్, అలబామా, మసాచుసెట్స్, మైనే, నార్త్ కరోలినా, టేనస్సీ, వర్జీనియా, ఓక్లహోమాలో విజయం సాధించారు. అంతకుముందు జరిగిన ప్రైమరీల్లో వాషింగ్టన్ మినహా మిగతా రాష్ట్రాల్లో ట్రంప్ నిక్కీ హేలీని ఓడించారు. దీంతో తాజా గెలుపుతో ట్రంప్ అధ్యక్ష రేసులో నిలవడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలవాలంటే 1215 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. గతంలో ట్రంపునకు 206 మంది ప్రతినిధులను సాధించారు. అయితే మంగళవారం జరిగిన ప్రైమరీలో ట్రంపునకు ఎంతమంది మద్దతిచ్చారనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

మరోవైపు డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ 13 రాష్ట్రాల్లో గెలుపొందారు. మిన్నెసోటా, కొలరాడో, అయోవా, అర్కాన్సాస్, వెర్మోంట్, టెక్సాస్, అలబామా, మసాచుసెట్స్, మైనే, నార్త్ కరోలినా, టేనస్సీ, వర్జీనియా, ఓక్లహోమా రాష్ట్రాల్లో బైడెన్ గెలుపొందినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు పోటీ పడుతున్న డీన్ ఫిలిప్స్, మరియాన్నే విలియమ్సన్‌లు అంతగా ప్రభావం చూపలేదు. దీంతో మరోసారి డెమోక్రాట్ల తరఫున బైడెన్ బరిలో నిలవడం ఖాయంగా చెప్పొచ్చు. తదుపరిగా మార్చి 12న నాలుగు రాష్ట్రాల్లో, 19న 5 రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది.

2020 సీన్ రిపీట్!

కీలకమైన సూపర్ ట్యూస్ డే సందర్భంగా ఒకేసారి జరిగిన 16 రాష్ట్రాల ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌లు భారీగా విజయాలను నమోదు చేయడంతో అధ్యక్ష రేసులో వీరిద్దరూ నిలవనున్నట్టు తెలుస్తోంది. దీంతో 2020 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ ట్రంప్, బైడెన్‌లు అధ్యక్ష రేసులో నిలవగా బైడెన్ అధ్యక్షునిగా గెలుపొందారు. ఇద్దరూ ప్రజాదరణ ఉన్న నేతలే కాబట్టి మరోసారి పోరు ఉత్కంఠగా మారనుంది. ఇప్పటికే పలు ప్రసంగాల్లో ట్రంప్ దూకుడు కొనసాగించారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో బైడెన్ కు పట్టిం కట్టిన అమెరికన్లు ఈ సారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story