రూ.191 కోట్లతో క్వీన్‌ ఎలిజబెత్‌-2 గోల్డ్ కాయిన్..

by Vinod kumar |
రూ.191 కోట్లతో క్వీన్‌ ఎలిజబెత్‌-2 గోల్డ్ కాయిన్..
X

లండన్ : బ్రిటన్‌ రాణి దివంగత ఎలిజబెత్‌-2 తొలి వర్ధంతి సందర్భంగా ఆమె స్మారకార్ధం ప్రఖ్యాత లైఫ్‌ స్టైల్‌ బ్రాండ్‌ ‘ది ఈస్ట్‌ ఇండియా కంపెనీ’ అత్యంత ఖరీదైన బంగారు నాణేన్ని విడుదల చేసింది. దీని ధర భారత కరెన్సీలో రూ.191 కోట్ల పైమాటే. ఈ కాయిన్‌ను తయారు చేసేందుకు నాలుగు కేజీల బంగారం, 6,400కు పైగా వజ్రాలను ఉపయోగించారు. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసంతో ఉన్న ఈ నాణెం బాస్కెట్‌బాల్‌ సైజులో ఉంది. కామన్వెల్త్‌ దేశాలకు చెందిన ప్రముఖ హస్త కళాకారులు మేరీ గిల్లిక్‌, ఆర్నాల్డ్‌ మచిన్‌, రాఫెల్‌ మక్లౌఫ్‌, ఇయాన్‌ ర్యాంక్‌ దాదాపు 16 నెలల పాటు శ్రమించి ఈ నాణేన్ని డిజైన్ చేశారు.

ఈ కాయిన్‌లో ఒకవైపు క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ఫొటో, మరోవైపు కిరీటం గుర్తు ఉన్నాయి. ఈ కాయిన్ చుట్టూ మరో 10 చిన్న నాణేలను పొదిగారు. ఇప్పటివరకు 1933లో రిలీజ్ అయిన ‘‘డబుల్‌ ఈగిల్‌’’ కాయిన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా (రూ.157 కోట్లు) ఉండేది. ఇప్పుడు దాని ధరల రికార్డును క్వీన్ ఎలిజబెత్-2 నాణెం తిరగరాసింది. బ్రిటిష్‌ పాలకులు వ్యాపారం కోసం నెలకొల్పిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1874లో మూతపడింది. దీన్ని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సంజీవ్‌ మెహతా 2010లో కొన్నారు.

Advertisement

Next Story