Betting Kingpin : బెట్టింగ్ కింగ్‌పిన్‌గా జ్యూస్ షాప్ ఓనర్.. త్వరలోనే దుబాయ్‌ నుంచి భారత్‌కు

by Hajipasha |
Betting Kingpin : బెట్టింగ్ కింగ్‌పిన్‌గా జ్యూస్ షాప్ ఓనర్.. త్వరలోనే దుబాయ్‌ నుంచి భారత్‌కు
X

దిశ, నేషనల్ బ్యూరో : మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అరెస్టు చేశారు. రూ.6000 కోట్ల బెట్టింగ్ స్కాంలో ఇతడే కీలక నిందితుడు అని ఈడీ, సీబీఐ వాదిస్తున్నాయి. ఇంటర్ పోల్ రెడ్ నోటీసు ద్వారా త్వరలోనే సౌరభ్ చంద్రకర్‌ను భారత్‌కు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను యూఏఈ అధికారులకు అందజేసే ప్రాసెస్‌ను ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సౌరభ్ చంద్రకర్‌ను విచారణ నిమిత్తం భారత్‌కు తీసుకురావాలంటూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ కోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆర్డర్ కాపీలను యూఏఈ అధికారులకు ఇప్పటికే సమర్పించినట్లు సమాచారం. సౌరభ్ చంద్రకర్, అతడి వ్యాపార భాగస్వామి రవి ఉప్పల్‌లను గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు దుబాయ్‌లోని వారివారి నివాసాల్లో హౌస్ డిటెన్షన్‌లో ఉంచారు.

భిలాయిలో జ్యూస్ షాప్..

2023 నవంబరులో అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌లు కలిసి దాదాపు రూ.508 కోట్ల ముడుపులను ముట్టజెప్పారని ఈడీ గతంలో ఆరోపించింది. సౌరభ్ చంద్రకర్ తొలుత ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయిలో జ్యూస్ షాప్ నడుపుకునేవాడు. అయితే 2019లో రవి ఉప్పల్‌తో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి మహదేవ్ బెట్టింగ్ యాప్‌ను నడపడం ప్రారంభించారు. మలేషియా, థాయ్ లాండ్, యూఏఈ, ఇండియాలలో కాల్ సెంటర్లను పెట్టి కస్టమర్లను కాంటాక్ట్ అవుతూ వ్యాపారాన్ని నడిపారు. భారత్‌లో వీరు దాదాపు 30 దాకా కాల్ సెంటర్లను నడిపారు. వీటిలో దాదాపు 4వేల మంది ప్యానల్ ఆపరేటర్లు పనిచేసేవారు. ఈ వ్యాపారం ద్వారా రవి ఉప్పల్, సౌరభ్‌లకు రోజూ దాదాపు రూ.200 కోట్ల దాకా ఆదాయం వచ్చేదని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి.యూఏఈలోని రస్ అల్ ఖైమాలో జరిగిన సౌరభ్ చంద్రకర్ పెళ్లి వేడుక కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేశారని ఛార్జిషీట్‌లో ఈడీ ప్రస్తావించింది. ఈ ఈవెంట్‌కు దాదాపు 17 మంది బాలీవుడ్ సెలిబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. వారందరికీ హవాలా మార్గంలో పేమెంట్స్ జరిగాయనే అభియోగాలు ఉన్నాయి.

Advertisement

Next Story