Trump: ట్రంప్ హత్యకు మరోసారి కుట్ర..!

by Shamantha N |
Trump: ట్రంప్ హత్యకు మరోసారి కుట్ర..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హత్యాయత్నం విఫలం అయ్యింది. దీంతో, మూడోసారి ట్రంప్ పై హత్యకు కుట్ర జరిగింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ట్రంప్ నిర్వహిస్తున్న ర్యాలీలో ఓ వ్యక్తి రెండు గన్ లతో సంచరించాడు. ఈ విషయం తమకు అందిందని సీక్రెట్ సర్వీసెస్ తెలిపాయి. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. అతడు లాస్ వేగాస్ కు చెందిన వేం మిల్లర్ అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ గానీ, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. వేం మిల్లర్ నకిలీ ప్రెస్‌కార్డు, ఎంట్రీ పాస్‌తో ర్యాలీ స్టేజీకి సమీపంలో లోడ్ చేసిన షాట్‌గన్, హ్యాండ్‌గన్, హై కెపాసిటీ గల మ్యాగజైన్‌తో తిరుగుతుండగా, అతడ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సీక్రెట్‌ సర్వీసెస్‌ సహాయంతో ట్రంప్‌పై జరగాల్సిన మరో హత్యాయత్నాన్ని ఆపగలిగామని అన్నారు.

ట్రంప్ పై హత్యాయత్నాలు

ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. గత జులైలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు. ఆ సమయంలో థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లింది. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ ని కాపాడారు. అంతే కాకుండా ఆఘటనలో నిందితుడు సహా పౌరుడు చనిపోయాడు. మరోసారి ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌బీచ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఫెన్సింగ్‌ నుంచి నిందితుడు గన్ తో రావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఆ వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story