Bangladesh: ఐల్యాండ్‌ని ఇవ్వనందుకే అమెరికా మా ప్రభుత్వాన్ని పడగొట్టంది: షేక్ హసీనా

by Harish |   ( Updated:2024-08-11 13:14:05.0  )
Bangladesh: ఐల్యాండ్‌ని ఇవ్వనందుకే అమెరికా మా ప్రభుత్వాన్ని పడగొట్టంది: షేక్ హసీనా
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తన ప్రభుత్వం కూలిపోవడానికి అమెరికాయే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. హసీనా పేర్కొన్న దాని ప్రకారం, పదవికి రాజీనామా చేయక ముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలనుకున్నాను. దానికి సంబంధించిన స్పీచ్ కూడా సిద్ధం చేసుకున్నాను. అయితే అప్పటికే ఆందోళన కారులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భద్రతా అధికారులు వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని సూచించడంతో ఆ ప్రసంగం చేయకుండానే భారత్‌కు వచ్చినట్లు ఆమె తెలిపారు.

ఆ ప్రసంగంలో ప్రజలకు ఈ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందని చెప్పాలనుకున్నాను అయితే అవకాశం లభించలేదు. బంగాళాఖాతంపై పట్టు సాధించడానికి బంగ్లాదేశ్‌కి దక్షిణాన బే ఆఫ్ బెంగాల్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ మార్టిన్ ఐల్యాండ్‌ని అమెరికా తమకు అప్పగించాలని కోరింది. కానీ నేను దానికి అంగీకరించకపోవడంతో కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఒకవేళ నేను వారి ప్రతిపాదనకు అంగీకరించినట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదని, రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని హసీనా అన్నారు.

వారు విద్యార్థుల శవాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. ఇంత మంది చనిపోతుంటే చూడలేక ప్రధాని పదవికి రాజీనామా చేశాను. బహుశా, నేను దేశంలో ఉండి ఉంటే, ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి. తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు. నేను తప్పకుండా తిరిగి వస్తాను. నేను ప్రస్తుతానికి ఓడిపోయి ఉండొచ్చు. కానీ బంగ్లాదేశ్ మాత్రం గెలిచింది. ఈ ప్రజల కోసమే నా నాన్న, కుటుంబం ప్రాణాలు అర్పించింది అని ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇండియాలోనే ఉన్న ఆమె, త్వరలోనే మళ్లీ బంగ్లాదేశ్‌కి వస్తారని ఆమె కొడుకు సాజీబ్ అన్నారు.

Advertisement

Next Story