Sheikh Hasina : బంగ్లాదేశ్ రాజకీయాలకు షేక్ హసీనా గుడ్‌బై

by Hajipasha |
Sheikh Hasina : బంగ్లాదేశ్ రాజకీయాలకు షేక్ హసీనా గుడ్‌బై
X

దిశ, నేషనల్ బ్యూరో: షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆమె కుమారుడు, మాజీ ప్రధాన సలహాదారు సజీబ్ వాజెద్ జాయ్ కీలక ప్రకటన చేశారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆయన వెల్లడించారు. ‘‘దేశాన్ని మార్చడానికి మా అమ్మ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. ప్రజల వైఖరి వల్ల ఆమె నిరాశచెందారు. రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు’’ అని సజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు. ‘‘షేక్ హసీనా అధికారంలోకి వచ్చే సమయానికి బంగ్లాదేశ్ ఒక విఫలమైన దేశం. కానీ ఆ తర్వాత పరిస్థితులను మార్చింది మా అమ్మే. ఆసియా ఖండంలో వేగంగా డెవలప్ అవుతున్న దేశంగా బంగ్లాదేశ్‌ను మార్చిన ఘనత హసీనాదే’’ అని ఆయన చెప్పారు.

‘‘షేక్ హసీనా విమర్శకులు ఆమె చేసిన ఆర్థిక పురోగతి, అభివృద్ధి గురించి చెప్పడం లేదు. కేవలం అవినీతి, బంధుప్రీతి గురించే వాళ్లు చర్చిస్తున్నారు. అది ఏకపక్ష వైఖరి’’ అని హసీనా కుమారుడు తెలిపారు. నిరసనకారులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్న వాదనను ఆయన ఖండించారు. నిరసనకారుల దాడిలోనే 13 మంది పోలీసులు చనిపోయిన విషయాన్ని సజీబ్ వాజెద్ గుర్తు చేశారు. ‘‘షేక్ హసీనా ఆదివారం నుంచే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడిమేరకు ఆమె తన భద్రత కోసం దేశం విడిచి వెళ్లిపోయారు’’ అని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed