Khaleda Zia : షేక్ హసీనా రాజకీయ విరోధి ఖలీదా జియా విడుదల

by Hajipasha |
Khaleda Zia : షేక్ హసీనా రాజకీయ విరోధి ఖలీదా జియా విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోయిన వెంటనే కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. హసీనాకు రాజకీయ బద్ధ శత్రువుగా చెప్పుకునే విపక్ష నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈమేరకు దేశాధ్యక్షుడి నుంచి ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది.

ఖలీదా జియా వయసు 78 ఏళ్లు. ఓ కుంభకోణం కేసులో ఆమెను 2018లో షేక్ హసీనా ప్రభుత్వం అరెస్టు చేయించింది. అనంతరం కోర్టు ఖలీదాకు జైలుశిక్షను విధించింది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖలీదా ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమా సారథ్యంలో నిర్వహించిన కీలక సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు, బీఎన్‌పీ అగ్రనేతలు, జమాతేఇస్లామీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా అరెస్టయిన విద్యార్థులందరినీ విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed