రసాయన ఆయుధాల నిషేధాన్ని రష్యా ఉల్లంఘించింది: అమెరికా తీవ్ర ఆరోపణలు

by samatah |
రసాయన ఆయుధాల నిషేధాన్ని రష్యా ఉల్లంఘించింది: అమెరికా తీవ్ర ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ దళాలకు వ్యతిరేకంగా విషవాయువు క్లోరోప్రిక్రిన్‌ను కీవ్‌లో ఉపయోగించడం సరికాదని తెలిపింది. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ విషపూరితమైన రసాయనాల ఉపయోగం మంచిది కాదు. ఉక్రెనియన్ దళాలను తరిమికొట్టడానికి, యుద్ధంలో వ్యూహాత్మక విజయం సాధించాలనే ఆలోచనతోనే వీటిని ఉపయోగించి ఉండొచ్చు’ అని పేర్కొంది.

రష్యా దళాలు ఉక్రెయిన్ పై దాడికి వాయువులతో లోడ్ చేయబడిన గ్రనేడ్లను ఉపయోగించినట్టు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. ఈ విషపూరిత పదార్థాల వల్ల సుమారు 500 మంది ఉక్రేనియన్ సైనికులు అస్వస్థతకు గురయ్యారని, ఓ సైనికుడు ఊపిరాడక మరణించాడని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్పందించి పై వ్యాఖ్యలు చేసింది. ఉక్రేనియన్ దళాలకు వ్యతిరేకంగా రష్యా క్లోరోపిక్రిన్ ఉపయోగించడం వల్ల కెమికల్ వెపన్స్ కన్వెన్షన్-1993ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అయితే యూఎస్ ఆరోపణలపై రష్యా స్పందించలేదు.

కాగా, క్లోరోపిక్రిన్ అనేది ఒక విషవాయువు. దీనిని మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ దళాలు ఉపయోగించాయి. దీనిని పీల్చిన వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. దీంతో 1993లో హేగ్ ఆధారిత సంస్థ ది ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్లూ) ద్వారా దీనిని నిషేధించారు. అనంతరం 193దేశాలు క్లోరోపిక్రిన్ నిల్వలను నాశనం చేశాయి. అయితే గతంలోనూ రష్యా, ఉక్రెయిన్‌లు ఓపీసీడబ్లూ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed