జోసెఫ్‌ స్టాలిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పుతిన్

by Hajipasha |
జోసెఫ్‌ స్టాలిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పుతిన్
X

దిశ, నేషనల్ బ్యూరో : వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి రష్యా అధ్యక్షుడు అయ్యారు. ఈనెల 15 నుంచి 17 వరకు జరిగిన రష్యా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆయన 88 శాతం ఓట్లతో బంపర్ విక్టరీని సాధించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులకూ అంతగా పాపులారిటీ లేకపోవడంతో పుతిన్ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. పోలైన ఓట్లలో 88 శాతం తనకే వచ్చాయని తెలిసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. ర‌ష్యా ప్రతిప‌క్ష నేత అలెక్సీ నావ‌ల్నీ మృతిపై పుతిన్‌ తొలిసారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే, అంతలోనే నావల్నీ మరణించారన్నారు. పశ్చిమ దేశాల కంటే రష్యా ప్రజాస్వామ్యం బలంగా ఉందని పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికాలో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ పాలనా వ్యవస్థలు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఈసందర్భంగా పుతిన్ గుర్తు చేశారు. ‘‘అమెరికా ఎన్నికలు స్వేచ్చగా, న్యాయంగా లేవు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది. అక్కడ ప్రజాస్వామ్యం లేనే లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్ బార్డర్‌లో బఫర్ జోన్..

నాటోకు పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి, రష్యా దళాలు నేరుగా తలపడితే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి అడుగు దూరంలో మాత్రమే నిలుస్తుందని కీలక కామెంట్ చేశారు. అయితే అలాంటి పరిస్థితులను ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే నాటో దళాలు మోహరించాయని పుతిన్ గుర్తు చేశారు. ఇదే విధంగా పాశ్చాత్య దేశాలు రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం పొంచి ఉందని ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పుతిన్ స్పందన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రష్యా తన భూభాగాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌లో బఫర్ జోన్‌ను సృష్టించడానికి కూడా వెనుకాడబోదని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యా ఇప్పుడు మరింత శక్తివంతంగా తయారైందన్నారు. కాగా, ఈ ఎన్నికలకు ముందు రష్యాలోని ప్రధాన రాజకీయ నాయకుడు అలెక్సీ నావల్నీ మరణించడంతో అధ్యక్షుడు పుతిన్‌కు తిరుగులేకుండా పోయింది. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్‌.. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అదే పదవిలో కొనసాగనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్‌ స్టాలిన్‌ను పుతిన్ అధిగమించనున్నారు.

Advertisement

Next Story