అణు యుద్ధానికి సిద్ధం: రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు

by samatah |
అణు యుద్ధానికి సిద్ధం: రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అణు యుద్ధానికి సిద్ధంగానే ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అమెరికా సైన్యాన్ని పంపితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. యుద్ధం మరింత పెరుగుతుందని చెప్పారు. బుధవారం రష్యాలో ఓ టెలివిజన్ చానల్‌కు పుతిన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్యా అణు యుద్ధానికి సిద్ధంగా ఉందా అని అడిగిన ప్రశ్నికు బదులిస్తూ.. అణుయుద్ధానికి పూర్తి సన్నద్దతతో ఉన్నామని, కానీ ఆ ప్రయోగానికి ఇప్పుడు తొందరేం లేదన్నారు. రష్యా సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో యూఎస్ దళాలను మోహరిస్తే ఏం జరుగుతుందో అమెరికాకు ఇప్పటికే అర్ధమైందని తెలిపారు. అణు యుద్ధం చేయడంలో ఇబ్బందేం లేదని.. అయితే ఉక్రెయిన్‌లో వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. రష్యా ప్రజలకు తనకు మరో ఆరేళ్లు అధికారం ఇవ్వడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

‘రష్యా-అమెరికా సంబంధాలలో అనేక మంది నిపుణులు ఉన్నారు. కాబట్టి అణు ఘర్షణ పరిస్థితులు తలెత్తుతాయని భావించట్లేదు. కానీ అనుకోని పరిస్థితులు ఎదురైతే మాత్రం వెనుకడుగు వేయబోము’ అని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పోరాడటానికి దళాలను పంపితే పశ్చిమ దేశాలు అణు యుద్ధాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని పుతిన్ గతంలోనూ హెచ్చరించారు. గత నెల రష్యా పార్లమెంట్‌లో ప్రసంగం సందర్భంగా పాశ్చాత్య దేశాలు రష్యాను లోపల నుంచి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి తమ ప్రభుత్వం ఎవరినీ అనుమతించదన్నారు. కాగా, అణ్వాయుధాలు ప్రయోగిస్తే భారీ విధ్వంసం జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. పెద్ద మొత్తంలో ప్రజలు మరణిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో అమెరికా జపాన్ మీద అనుబాంబు ప్రయోగం జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్యా, అమెరికాల వద్ద ఎక్కువ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story