భూమిని తాకిన రాకాసి సౌర తుఫాను.. ఏమైందంటే ?

by Hajipasha |
భూమిని తాకిన రాకాసి సౌర తుఫాను.. ఏమైందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : శ‌క్తివంత‌మైన సౌర తుఫాను శుక్ర‌వారం ఉదయం 4 గంటల సమయంలో భూమిని తాకింది. దీంతో ఆస్ట్రేలియాలోని టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు ఆకాశంలో ఖగోళ అద్బుతం కనువిందు చేసింది. ఆకాశంలో రంగురంగుల అరోరాలు ఏర్ప‌డ్డాయి. సూర్యుడి ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల నుంచి విడుదలైన అనేక కరోనల్ మాస్ ఎజెక్షన్‌ (సీఎంఈ)లలో ఇది మొదటిది. సాధార‌ణంగా భూమి వైపు వ‌చ్చే సోలార్ ఫ్లేర్స్ క‌న్నా సీఎంఈలు అతి వేగంగా భూమిని చేరుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘సీఎంఈలు సెక‌నుకు 500 మైళ్ల వేగంతో ప్ర‌యాణిస్తాయి. భూమి క‌న్నా 17 రెట్లు పెద్ద‌గా ఉన్న స‌న్‌స్పాట్ నుంచి బ‌ల‌మైన‌ సీఎంఈలు వ‌స్తున్నాయి. సూర్యుడు 11ఏళ్ల సైకిల్‌కు చేరువ‌వుతున్న నేప‌థ్యంలో ఈ సోలార్ స్టార్మ్స్ వ‌స్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ఈ సౌర తుఫాను ధాటికి శాటిలైట్లు, ప‌వ‌ర్ గ్రిడ్‌ల‌కు స‌మ‌స్య‌లు త‌లెత్తే రిస్క్ ఉందని సైంటిస్టులు అన్నారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని సీఎంఈలు భూమిని తాకే అవ‌కాశాలు ఉన్న‌ట్లు హెచ్చరించారు. ఈనేపథ్యంలో శాటిలైట్ ఆప‌రేట‌ర్లు, ఎయిర్‌లైన్స్‌, ప‌వ‌ర్ గ్రిడ్ సంస్థ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచనలు జారీ చేశారు. 2003 అక్టోబరు తర్వాత భూమిని తాకిన అతిపెద్ద సౌర తుఫాను ఇదేనని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ తెలిపింది.

స్టార్‌లింక్ సేవలకు అంతరాయం..

అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌‌కు చెందిన స్పేస్ఎక్స్‌ కంపెనీకి ‘స్టార్‌లింక్’ శాటిలైట్లు ఉన్నాయి. అవి కూడా సౌర తుఫాను వల్ల ప్రతికూలంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. తుఫాను శాటిలైట్లను తాకినందుకు.. వాటికి సంబంధించిన సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వినియోగదారుల్ని స్పేస్ ఎక్స్ కంపెనీ హెచ్చరించింది. సేవలను తిరిగి గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్నామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed