ఎన్నికలకు ముందు పాక్‌లో అలజడి: ఈసీ కార్యాలయంలో బాంబు పేలుడు

by samatah |
ఎన్నికలకు ముందు పాక్‌లో అలజడి: ఈసీ కార్యాలయంలో బాంబు పేలుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఈ నెల 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి కరాచీలోని ఆ దేశ ఎన్నికల కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సీనియర్ పోలీస్ అధికారి సాజిద్ సదోజాయ్ తెలిపారు. ఎలక్షన్ కార్యాలయం గోడ వద్ద షాపింగ్ బ్యాగ్‌లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్టు వెల్లడించారు. పేలుడు తీవ్రతను అంచనా వేయడానికి బాంబు స్వ్కాడ్‌ను ఘటనా స్థలానికి రప్పించి దర్యాప్తు చేపట్టారు. సుమారు 400 గ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన బాంబు పేలుడుకు కారణమైందని బాంబు నిర్వీర్య దళం (బీడీఎస్) తెలిపింది. పేలుడు ప్రదేశంలో టైమ్ డివైజ్, 12-వోల్ట్ బ్యాటరీని కనుగొన్నట్టు పేర్కొంది. ఈ ఇష్యూపై పాక్ ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అయితే భద్రతా పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story