మరోసారి హౌతీల దుశ్చర్య..భారత్‌కు వస్తున్న నౌకపై క్షిపణి దాడి

by samatah |
మరోసారి హౌతీల దుశ్చర్య..భారత్‌కు వస్తున్న నౌకపై క్షిపణి దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. భారత్‌కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే నౌకపై క్షిపణి దాడి చేశారు. నౌకపై మూడు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ దాడి వల్ల నౌకకు స్వల్ప నష్టం వాటిల్లినట్టు తెలిపింది. అంతేగాక మరో నౌక ఎంవీ మైషాపైనా దాడి జరిగిందని కానీ దానికి ఎటువంటి నష్టం వాటిల్ల లేదని పేర్కొంది. పాలస్తీనియన్లకు మద్దతుగా వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగిస్తున్నామని హౌతీ ప్రతినిధి యహ్యా సరియా తెలిపారు. పనామా జెండాతో ఉన్న నౌకపై దాడి చేశామని వెల్లడించారు. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు.

అండ్రోమెడా స్టార్ అనే నౌక బ్రిటిష్‌కు చెందినది కాగా..ఇటీవలే దీనిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఇది రష్యాతో అనుసంధానించబడిన వాణిజ్యంలో నిమగ్నమై ఉంది. చమురుతో కూడా ఈ నౌక రష్యాలోని ప్రిమోర్స్క్ నుంచి భారత్‌లోని వదినార్‌కు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాకు మద్దతుగా గతేడాది నుంచి హౌతీలు ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. డ్రోన్లు, క్షిపణులతో నిరంతరం విరుచుకుపడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్‌ల నౌకలే లక్ష్యంగా అటాక్స్ చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

Advertisement

Next Story