యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదు..రష్యా, ఉక్రెయిన్ వార్‌పై మోడీ వ్యాఖ్యలు

by vinod kumar |
యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదు..రష్యా, ఉక్రెయిన్ వార్‌పై మోడీ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని వెంటనే దానికి స్వస్తి పలికి శాంతి చర్చలు జరపాలని పుతిన్‌కు సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యుద్ధ భూమిలో సంఘర్షణకు సొల్యూషన్ లేదన్నారు. దౌత్య మార్గాల ద్వారా మాత్రమే వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కొత్త తరానికి ఉజ్వల భవిష్యత్తు అందించడానికి ఇరు దేశాల మధ్య శాంతి అవసరమని నొక్కి చెప్పారు. కానీ బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావని స్పష్టం చేశారు. శాంతి పున‌రుద్ధరణకు స‌హ‌క‌రించ‌డానికి భార‌త్ సిద్ధంగా ఉందని తెలిపారు.

చిన్నారుల మరణాలు బాధ కలిగిస్తున్నాయి

యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాణ నష్టం జరిగినప్పుడు బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ యుద్ధంలో అమాయక పిల్లలు హత్యకు గురైనప్పుడు గుండె తరుక్కు పోతుందని.. ఆ బాధ వర్ణించలేదని తెలిపారు. కాబట్టి శాంతి, స్థిరత్వం ఎంతో అవసరమని చెప్పారు. భారతదేశం శాంతికి అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా ప్రపంచ సమాజానికి హామీ ఇస్తున్నట్టు తెలిపారు. రష్యా సహకారంతో భారత్ ఇంధన ధరల పెంపు నుంచి తప్పించుకోగలిగిందన్నారు. ప్రపంచం ఇంధన సవాల్‌ను ఎదుర్కొంటున్నప్పుడు రష్యా భారత్‌కు మద్దతిచ్చిందని కొనియాడారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ..యుద్ధానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో మోడీ చేసిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ రష్యా పర్యటన అనంతరం ఆస్ట్రియా దేశానికి వెళ్లారు.

సవాళ్లను సవాల్ చేయడం నా తత్వం

పుతిన్‌తో భేటీ కన్నా ముందు ప్రధాని మోడీ రష్యాలోని భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. రష్యాలోని కజాన్, యెకటెరిన్‌బర్గ్ నగరాల్లో రెండు కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. తన హయాంలో భారత ఘనతను ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి తీసుకొచ్చామని కొనియాడారు.సవాళ్లను ఎదుర్కొనడం తన తత్వమని, అది తన డీఎన్ఏలోనే ఉందని తెలిపారు. యుద్ధ ప్రాంతాల నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు పుతిన్ చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పారు. రష్యా పర్యటనకు తాను ఒక్కడినే రాలేదని 140 కోట్ల మంది ప్రజల ప్రేమను, దేశ మట్టి పరిమళాన్ని మోసుకొచ్చినట్టు తెలిపారు.భారత ఆర్థికవ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని నొక్కి చెప్పారు.

రష్యా సైన్యంలోని భారతీయులకు ఊరట

ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులకు ఊరట లభించింది. క్రెమ్లిన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదలచేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. మోడీ ఈ విషయాన్ని పుతిన్ వద్ద ప్రస్తావించగా ఆయన వెంటనే దానికి ఓకే చెప్పారు. తమ సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులను వెంటనే విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని..స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

మోడీ, పుతిన్‌ భేటీపై జెలెన్‌స్కీ అసహనం

భారత్ ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు భేటీ అవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ రష్యా పర్యటన తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిపారు. ఇది శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ అని చెప్పారు. మోడీ పుతిన్ లు అలింగనం చేసుకోవడాన్ని ఉద్దేశించి ప్రస్తావిస్తూ.. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడు ప్రపంచంలోని అత్యంత నేరస్థుడిని కౌగిలించుకున్నారు’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story