ఇరాన్‌పై ప్రతిదాడికి ఇజ్రాయెల్ రెడీ?

by Mahesh Kanagandla |
ఇరాన్‌పై ప్రతిదాడికి ఇజ్రాయెల్ రెడీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యాసియాలో పరిస్థితులు మరింత దిగజారేలా ఉన్నాయి. గాజాను బాంబుల వణికిస్తున్న ఇజ్రాయెల్ పై లెబనాన్ నుంచి హిజ్బుల్లా గ్రూపు దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా టాప్ కమాండర్‌ను హతమార్చింది. దీంతో ఇరాన్ తొలిసారిగా ఇజ్రాయెల్‌తో కదనానికి కాలుదువ్వింది. ఈ నెల 1వ తేదీన ఇజ్రాయెల్ పై మూకుమ్మడిగా బాలిస్టిక్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడి యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేసింది. ఇరాన్ పై ప్రతిదాడికి ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇందుకు సంబంధించి బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఫోన్ మాట్లాడారు. సుమారు 50 నిమిషాలు మాట్లాడిన ఈ ఫోన్‌ కాల్‌లో ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ కూడా జాయిన్ అయ్యారు.

దాడి చేస్తే ఊరుకోం:

ఇది వరకే ఇరాన్ పై ప్రతిఘటనకు దిగితే.. అక్కడి న్యూక్లియర్ ఫెసిలిటీస్‌పై, ఆయిల్ రిజర్వ్‌లపై దాడి చేయవద్దని అమెరికా కండీషన్ పెట్టింది. కొన్ని వారాల తర్వాత బైడెన్‌తో నెతన్యాహు సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై ప్రతిదాడికి సంబంధించే ఈ చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ప్రతిదాడికి షరతులతో కూడిన అంగీకారాన్ని అమెరికా ఇచ్చే చాన్స్ ఉన్నది. తమపై దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇది వరకే ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఈ ప్రతిదాడి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందానే అనే ఆందోళనలు వెలువడుతున్నాయి.

గాజా హాస్పిటల్ పై దాడి:

మరోవైపు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నది. కాగా, హిజ్బుల్లాలు బుధవారం మధ్యాహ్నం 90 రాకెట్లు ఇజ్రాయెల్ పై ప్రయోగించినట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఇందులో చాలా వరకు రాకెట్లను తాము అడ్డుకున్నా.. కొన్ని ఇజాయెల్‌లో పడ్డాయని వివరించింది. ఇలా పడిన రెండు రాకెట్లతో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. కాగా, ఉత్తర గాజాలోని జబల్యా శరణార్థుల శిబిరంలోని హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని చెబుతూ దాడి చేయగా.. 18 మంది మరణించారు. సుమారు 20 మంది గాయపడ్డారు. గత 9 రోజుల్లో ఇజ్రాయెల్‌లో మూడు ఉగ్రదాడులు జరిగాయి. మొన్న టెల్ అవీవ్‌లో జరగ్గా బుధవారం హదేరాలో జరిగింది. దాడిలో ఆరుగురు ఇజ్రాయెలీ పౌరులు గాయపడగా పోలీసులు ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

Advertisement

Next Story