Ratan Tata: రతన్ టాటా ఇకలేరు

by S Gopi |   ( Updated:2024-10-09 20:09:11.0  )
Ratan Tata: రతన్ టాటా ఇకలేరు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా పేరు వినగానే భారత వ్యాపార సామ్రాజ్యంలో నమ్మకానికి, నాణ్యతకు బ్రాండ్. ఉప్పు దగ్గరి నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్కుల దాకా దేశంలోని అనేక వ్యాపారాల్లో అగ్రగామిగా అందరికీ తెలుసు. 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ ఎదిగింది. దీనికి ప్రధాన కారణం రతన్ టాటా. టాటా గ్రూప్‌ను అత్యంత విజయవంతంగా నడిపిన వ్యక్తి రతన్ టాటా. బుధవారం టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, 86 ఏళ్ళ వయసులో మరణించారు. సోమవారం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. దానికి సోషల్ మీడియా పోస్ట్‌లో తన ఆరోగ్యంపై ఉన్న ఊహాగానాలను తోసిపుచ్చారు. వయస్సు కారణంగా సాధారణ వైద్య పరీక్షలు జరుగుతున్నాయని ప్రకటన విడుదల చేశారు. అయితే, బుధవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 1937, డిసెంబర్‌ 28న జన్మించిన రతన్‌ టాటా 1990 నుంచి 2012 మధ్య టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు.

1991లో స్టీల్-టు-సాఫ్ట్‌వేర్ గ్రూప్ టాటాకు ఛైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు తీసుకున్నారు. వందేళ్ల క్రితం తన ముత్తాత స్థాపించిన గ్రూప్‌ను 2012 వరకు విజయవంతంగా నడిపారు. రతన్ టాటా నేతృత్వంలో 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించారు. 2004లో టాటా గ్రూప్ దిగ్గజ బ్రిటిష్ కార్ బ్రాండ్‌లైన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌లను కొనుగోలు చేసింది.

2009లో రతన్ టాటా ప్రపంచంలోనే అత్యంత చవకైన కారును మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మాట ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ రూ. లక్ష ధరలో టాటా నానోను విడుదల చేశారు. ఆయన 2017 తర్వాత రోజువారీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఛారిటబుల్ ట్రస్ట్‌లకు చూసుకుంటున్నారు.

రతన్ టాటా తర్వాత టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన వ్యాపార తీరును టాటా బోర్డు వ్యతిరేకించడంతో తప్పుకున్నారు. అనంతరం 2022లో సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరి మధ్య ఉన్న తీవ్ర వైరం మాత్రం అలాగే మిగిలిపోయింది. పదవీవిరమణ తర్వాత రతన్ టాటా టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌లకు ఎమెరిటస్ చైర్మన్ అయ్యారు.

వ్యక్తిగత జీవితం..

1937లో జన్మించిన రతన్ టాటా 1948లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగారు. కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. హార్వర్డ్‌లో మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు.

బహుమతులు..

2008లో రతన్ టాటా భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. అనంతరం 2000లో మూడవ అత్యున్నతమైన పద్మభూషణ్ అందుకున్నారు.

కెరీర్..

* 1955లో ఏడేళ్ల పాటు ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ చదవడానికి కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.

* 1962లో టాటా సన్స్‌లో చేరారు. టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (ఇప్పుడు టాటా మోటార్స్)లో కొంతకాలం పనిచేశారు.

* 1963లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టిస్కో)లో చేరారు.

* 1970లో కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉండి తిరిగి వచ్చిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో చేరారు.

* 1971లో నెల్కొ (నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్) డైరెక్టర్-ఇన్‌ఛార్జ్‌గా నియమించబడ్డారు. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సందర్భంలో మెరుగైన ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని నిర్మించేందుకు రతన్ టాటా కృషి చేశారు. అయితే సంస్థలో ఆర్థిక, యూనియన్ సమస్యలతో విజయవంతం కాలేదు.

* 1974లో టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్ అయ్యారు.

* 1977లో టాటా గ్రూప్ యూనిట్‌గా ఉన్న ఎంప్రెస్ మిల్స్‌కు బదిలీ అయ్యారు. మిల్స్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇతర కంపెనీ అధికారులు దానిని తిరస్కరించడంతో మిల్లు మూతబడింది. రతన్ టాటా మళ్లీ టాటా ఇండస్ట్రీస్‌కు మారారు.

* 1981లో టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా బాధ్యతలు.

* 1986లో నేషనల్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా ఛైర్మన్ అయ్యారు.

* 1991లో జేఆర్‌డీ టాటా టాటా గ్రూప్‌కు రతన్ టాటాను ఛైర్మన్‌గా నియమించారు. ఆ సమయంలో రతన్ టాటాకు గ్రూప్ బాధ్యతలను నిర్వహించే సామర్థ్యం గురించి సంస్థలోని వారే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాతి కాలంలో టాటా గ్రూప్ ఎదుగుదలకు, దాని విజయానికి కారణమయ్యారు.

* రతన్ టాటా జపాన్‌కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ అంతర్జాతీయ సలహా బోర్డు, జేపీ మోర్గాన్ చేజ్, బూజ్ అలెన్ హామిల్టన్, అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో సభ్యుడుగా కూడా ఉన్నారు.

* 2012 డిసెంబర్‌లో తన 75వ పుట్టినరోజున రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అతను అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.

రతన్ టాటా - ప్రధాన విజయాలు..

టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో ఆయన కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా గుర్తించేంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన హయాంలోనే కంపెనీ ఆర్థికంగా అనేక విజయాలను సాధించింది. టాటా గ్రూప్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోనూ చేరింది. కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా టాటాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చారు. టాటా నానో, టాటా ఇండికా ద్వారా వాహన రంగంలో చారిత్రాత్మక మార్పులు తెచ్చారు.

రతన్ టాటా తన వాటాలో 65 శాతానికి పైగా ఛారిటబుల్ ట్రస్ట్‌లలో పెట్టారు. భారతీయులకు మెరుగైన నాణ్యమైన జీవనాన్ని అందించడం, మానవాభివృద్ధిని అందించడం ఆయన జీవిత లక్ష్యంగా చివరి వరకు పనిచేశారు.

రతన్ టాటా నెట్‌వర్త్..

దేశంలోని అతిపెద్ద గ్రూప్ సంస్థలలో ఒకటైన టాటాలో కీలక వ్యక్తి అయినప్పటికీ.. బిలియనీర్ల జాబితాలో ఆయన ఎప్పుడూ ఆసక్తిగా లేరు. ఆయన సమకాలీనులతో పోలిస్తే టాటా వ్యక్తిగత సంపద చాలా తక్కువగా ఉంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.. రతన్ టాటా నికర విలువ సుమారు రూ. 3,800 కోట్లు ఉన్నట్టు అంచనా. ర్యాంకింగ్స్‌లో 421వ స్థానంలో ఉన్నారు.

ఎందుకంటే..

రతన్ టాటా సంపద తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన తన సంపదలోంచి ఎక్కువ భాగం దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వడమే. టాటా సన్స్‌లో గణనీయమైన వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్‌లకు తన సంపాదనలో 66 శాతం విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధితో సహా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు అందిస్తున్నారు. లాభాల కంటే సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వడమనే టాటా గ్రూప్‌లోని సుదీర్ఘ సంప్రదాయానికి ఆయన ప్రతీక.

రతన్ టాటా- అవార్డులు..

* భారత ప్రభుత్వ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ (2000).

* ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పతకం (గవర్నమెంట్ ఆఫ్ ఉరుగ్వే-2004).

* అంతర్జాతీయ విశిష్ట సాఫల్య పురస్కారం (బినై బర్త్ ఇంటర్నేషనల్-2005).

* ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ గౌరవ ఫెలోషిప్ (2007).

* పద్మవిభూషణ్ (భారత ప్రభుత్వ 2వ అత్యున్నత పౌర పురస్కారం-2008).

* ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ (గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ-2009) 'గ్రాండ్ ఆఫీసర్' అవార్డు.

* గౌరవ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, యునైటెడ్ కింగ్‌డమ్ (2009).

* ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు (బిజినెస్ ఫర్ పీస్ ఫౌండేషన్-2010).

* గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్-2014.

Advertisement

Next Story