Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు మేం ఎప్పటికీ మద్దతివ్వం

by S Gopi |
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు మేం ఎప్పటికీ మద్దతివ్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ బుధవారం పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు 2024కి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో సీఎం సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను పార్లమెంటులో ప్రవేశపెడితే మేం ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని సీఎం సోరెన్ స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టాన్ని ఈ బిల్లు ఎలా బలహీనపరుస్తుంది. వక్ఫ్ ఆస్తుల అక్రమణకు ఎలా దారితీస్తుందో హేమంత్ సోరెన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యవాదం, దేశ బహుళత్వ నిర్మాణానికి విరుద్ధమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఎస్.క్యూ.ఆర్. ఇలియాస్ 'ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం ఒక వాయిస్‌గా, మైనారిటీల అణచివేతకు వ్యతిరేకంగా మా పోరాటంలో మీరు మాతో పాటు నిలబడతారని మేము ఆశిస్తున్నాము' అని ముఖ్యమంత్రిని కోరారు. 'ముస్లింల న్యాయమైన సమస్యలకు నేను ఎప్పుడూ మద్దతిస్తాను, అలాగే కొనసాగుతాను. ఈ దురుద్దేశపూరిత బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించకుండా అన్ని చర్యలు తీసుకుంటాను. రేపు తీర్మానం చేస్తాం' అని సీఎం సోరెన్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed