- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025 : తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్ ఢీ.. ఆరంభం ఎవరిదో?.. టెన్షన్ పెడుతున్న వరుణుడు

దిశ, స్పోర్ట్స్ : డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-18వ సీజన్‌కు తెరలేవనుంది. కోల్‌కతా వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. 17 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎదురుపడటం గమనార్హం. ఇంతకుముందు ఆరంభ సీజన్ 2008లో ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లకు ఈ సారి కొత్త సారథులు వచ్చారు. కేకేఆర్‌ను సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె నడిపించనుండగా.. ఆర్సీబీకి యువ బ్యాటర్ రజత్ పటిదార్ నాయకత్వం వహించబోతున్నాడు. రెండు జట్లు టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాయి. బలాబలాలపరంగా ఇరు టీమ్‌లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, రహానె, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, రస్సెల్‌లతో కోల్‌కతా బ్యాటింగ్ దళం బలంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి స్పిన్నర్లకుతోడు హర్షిత్ రాణా, నోర్జే, స్పెన్సర్ జాన్సెన్‌లతో కూడిన పేస్ దళం బాగానే ఉంది. మరోవైపు, కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్‌లకుతోడు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ వంటి హిట్టర్లతో బెంగళూరు బ్యాటింగ్ దళానికి కూడా ఢోకా లేదు. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజెల్‌వుడ్ వంటి పేసర్లు ఆర్సీబీకి బలంగా కనిపిస్తున్నారు. అయితే, స్పిన్నర్ల లోటు కనిపిస్తుంది. ఆర్సీబీ, కేకేఆర్ ఇప్పటివరకు 34 సార్లు ఎదురుపడ్డాయి. అందులో ఆర్సీబీ 14 మ్యాచ్‌లలో నెగ్గగా.. కేకేఆర్ 20 విజయాలతో ఆధిపత్య స్థితిలో ఉంది.
వరుణుడు కరుణిస్తాడా?
ఐపీఎల్ ప్రారంభానికి వరుణుడి గండం పొంచి ఉంది. కోల్‌కతాలో మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. కోల్‌కతాకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడనున్నట్టు పేర్కొంది. వర్షం కారణంగా శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. ఈ వారం ఆరంభంలో కోల్‌కతా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ వర్షార్పణమైంది. ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే సాగింది. నేడు రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. అంతకుముందు నుంచే వర్షం పడే అంచనాలు ఉన్నాయి. 6 గంటలకు ప్రారంభ వేడుకలు జరుగుతాయి. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. శనివారం సాయంత్రం 90 శాతం వర్ష సూచన ఉంది. వర్షం ముప్పు పొంచి ఉండటంతో ప్రారంభ వేడుకలు, మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. భారీగా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దయ్యే చాన్స్ ఉంది. రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.