రేపు డిలిమిటేషన్​ పై అసెంబ్లీలో తీర్మాణం

by M.Rajitha |
రేపు డిలిమిటేషన్​ పై అసెంబ్లీలో తీర్మాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : డిలిమిటేషన్​కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మాణం చేయనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డిలిమిటేషన్​పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ , జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కేంద్రం విధించే జరిమానాను వ్యతిరేకిస్తూ తీర్మాణం చేయనున్నారు. ఈ తీర్మాణాన్ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రవేశపెడతారు. తీర్మాణం ప్రవేశపెట్టిన తరువాత సభలోని రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నాయి. డిలిమిటేషన్​ను బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తుందని, ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ ఆ ప్రాంతంలో సీట్లు పెంచుకొని మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతోనే ఈ విధంగా అక్కడ ఎక్కువ సీట్లు పెంచుతుందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే విధంగా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని కుట్ర చేస్తుందని కాంగ్రెస్​ సహా ఇక్కడి ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. చెన్నైలో శనివారం అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రంలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలు, వైఎస్​ఆర్​ సీపీ ప్రతినిధులు హాజరుకాలేదు. ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డిలిమిటేషన్​కు వ్యతిరేకంగా తీర్మాణం చేయనున్నట్లుగా ప్రకటించారు. దీనిలో భాగంగా సోమవారం తీర్మాణం చేయనున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో ప్రకటించారు. డిలిమిటేషన్​పై త్వరలోనే హైదరాబాద్​లో అఖిల పక్ష సమావేశం తదుపరి సమావేశం నిర్వహించనున్నట్లుగా, ప్రజలను బాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తీర్మాణంచేసి కేంద్రానికి పంపించనున్నారు. లోక్ స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్ల‌పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అది సాధ్యం కాకుంటే ప్రధానంగా రేవంత్​రెడ్డి డిలిమిటేషన్​పై ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు.

543 సీట్లు ఉన్న లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130 అని, ఈ పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డే నూత‌న లోక్‌స‌భ‌లో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాల‌నేది ద‌క్షిణాది రాష్ట్రాలుగా మా డిమాండ్‌ అని, బీజేపీ 50 శాతం సీట్ల‌ను పెంచాల‌నుకుంటే అలా పెరిగే 272 సీట్ల‌తో మొత్తం లోక్ స‌భ సీట్ల సంఖ్య 815 అవుతుందని, ఇందులో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలి ఆయన డిమాండ్​చేస్తున్నారు. ఈ సీట్ల‌ను ద‌క్షిణాదిలోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరిల‌కు ఇప్పుడున్న‌ ప్రొరేటా ప్రాతిప‌దిక‌న పంచ‌వ‌చ్చు సూచిస్తున్నారు. తీర్మాణంపై చర్చ నేపథ్యంలో అసెంబ్లీ ల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తీర్మాణం అనంతరం పద్దులపై చర్చించనున్నారు. దీనితో పాటుగా పంచాయతీరాజ్​, మున్సిపల్​ చట్టాలకు సవరణ చేయనున్నారు. కొత్తగా ఆరు మున్సిపాలిటిలు, కొత్తగూడెం కార్పొరేషన్​ గా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల సరిహద్దులు, పేర్లను మార్చనున్నారు.

Next Story