ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టుల విధి

by John Kora |
ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టుల విధి
X

- భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పక గౌరవించాలి

- విభిన్న అభిప్రాయాలను అణచివేయకూడదు

- కాంగ్రెస్ ఎంపీపై కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో: పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టుల విధి, ముఖ్యంగా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో పౌరుల హక్కులను గౌరవించాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి పోస్టు చేసిన ఒక వీడియోకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలతోసహా.. సాహిత్యం మానవుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తుంది. ఒక వ్యక్తి చేసిన అభిప్రాయం మెజార్టీ ప్రజలకు నచ్చకపోయినా.. సదరు వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రానికి గౌరవం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వాక్ స్వాతంత్రం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల విధి అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన ప్రజాస్యామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను ప్రతివాదనతో ఎదుర్కోవాలి. అంతే కానీ అణచివేత ధోరణి పనికి రాదని చెప్పింది. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేపై కునాల్ కామ్రా చేసిన స్టాండప్ యాక్ట్ వివాదాస్పదమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిపై నమోదైన కేసును కొట్టి వేయాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ కొట్టేయడానికి వీలు లేదని, దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై ఇమ్రాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇవ్వాళ ఆ కేసుపై విచారణ జరిగింది. జనవరి 3న జామ్‌నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి సంబంధించి రెచ్చగొట్టే పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారని ఇమ్రాన్‌పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196 , సెక్షన్ 187 కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ పాటలోని సాహిత్యం రెచ్చగొట్టేలా ఉందని, జాతీయ సమైక్యతను దెబ్బదీసేలా ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. తాజాగా, ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Next Story

Most Viewed