ఆ టైం తర్వాత మాల్దీవుల్లో భారత సైనికులు ఉండొద్దు: మహమ్మద్ ముయిజ్జు

by samatah |
ఆ టైం తర్వాత మాల్దీవుల్లో భారత సైనికులు ఉండొద్దు: మహమ్మద్ ముయిజ్జు
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. మే 10వ తేదీ తర్వాత భారత సైనికులను ఎట్టి పరిస్థితుల్లో తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. యూనిఫామ్ లేకుండా, పౌర దుస్తుల్లో ఉన్న వారు కూడా మాల్దీవులకు రావొద్దని చెప్పినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మాల్దీవులను విడిచిపెట్టిన భారత సైనికులపై కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. పౌర దుస్తుల్లో ఉన్న భారత సైనికులను సైతం గడువు అనంతరం మాల్దీవుల్లోకి రానివ్వబోమని చెప్పారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు మాల్దీవులకు చైనా ఉచిత సైనిక సహాయాన్ని అందించే ఒప్పందంపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే ముయిజ్జూ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

మాల్దీవులకు చేరుకున్న సాంకేతిక సిబ్బంది

అంతకుముందు మాల్దీవుల్లోని మూడు విమానయాన ప్లాట్‌ఫామ్‌లలో ఒకదానిపై నియంత్రణ చేపట్టేందుకు భారతీయ పౌర బృందం మాల్దీవులకు చేరుకుంది. సైనికుల స్థానంలో, భారతదేశానికి చెందిన సాంకేతిక సిబ్బంది మాల్దీవుల రెస్క్యూ యూనిట్‌ను నిర్వహిస్తారు. మాల్దీవుల్లో ప్రస్తుతం 88 మంది భారత సైనికులు ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 2న ఢిల్లీలో మాల్దీవులు, భారత అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మే 10 నాటికి మాల్దీవులలోని తన సైనిక సిబ్బందిని భారత్ ఉపసంహరించుకుంటుందని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed