Middle East: దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి.. పలువురు మృతి

by Harish |   ( Updated:2024-08-17 07:21:44.0  )
Middle East: దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి.. పలువురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా శనివారం ఇజ్రాయెల్, దక్షిణ లెబనాన్‌‌లో వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో కొన్ని క్షిపణులు హిజ్బుల్లా ఆయుధ స్థావారాలను తాకినట్లు సమాచారం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్న దాని ప్రకారం, ఈ దాడులు శనివారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తుంది. నబాతిహ్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు, మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు, వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇజ్రాయెల్ దాడి చేసిన హిజ్బుల్లా ఆయుధ స్థావరం ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపం నుంచి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత అక్టోబర్‌లో గాజా స్ట్రిప్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్, ఇజ్రాయెల్ దళాలు సరిహద్దులో దాదాపు ప్రతిరోజు కాల్పులు జరుపుకుంటున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తులు ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి చర్చలు జరపడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ఇరువర్గాలు దాడులను పెంచడం ద్వారా కాల్పుల విరమణ, బందీల విడుదలపై సంధి చర్చలకు ఆటంకం కలుగుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story