Bangladesh crisis: బంగ్లాదేశ్ హింస బాధితులకు ఆశ్రయం కల్పించడానికి రెడీ: మమతా బెనర్జీ

by Harish |   ( Updated:2024-07-21 11:40:27.0  )
Bangladesh crisis: బంగ్లాదేశ్ హింస బాధితులకు ఆశ్రయం కల్పించడానికి రెడీ: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. హింసాత్మక నిరసనల మధ్య ఇప్పటికే 100 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హింస కారణంగా ప్రభావితమైన బాధితులు, నిస్సహాయులకు తాము ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ మెగా 'అమరవీరుల దినోత్సవం' ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ మరో దేశం కాబట్టి, నేను దాని గురించి ఏమీ మాట్లాడలేను. దాని గురించి భారత ప్రభుత్వం మాట్లాడుతుంది. కానీ నిస్సహాయులైన అక్కడి వారు బెంగాల్ తలుపు తడితే, మేము వారికి ఆశ్రయం ఇస్తాము, ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం, శరణార్థులను గౌరవిస్తామని అన్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింసాకాండకు ముగింపు పలకాలని ఆమె ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న బెంగాల్ నివాసితులు, వారి బంధువులకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఆమె చెప్పారు.

ఇదిలా ఉంటే, ఆందోళనలు తీవ్రం కావడంతో దీనిపై విచారణ చేపట్టిన ఆ దేశ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించి, 93 శాతం నియామకాలను ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే, మిగిలిన రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

Next Story

Most Viewed