ఇజ్రాయెల్‌పై లెబనాన్ క్షిపణి దాడి: ఓ భారతీయుడు మృతి

by samatah |
ఇజ్రాయెల్‌పై లెబనాన్ క్షిపణి దాడి: ఓ భారతీయుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ చేసిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 11గంటల సమయంలో ఉత్తర ఇజ్రాయెల్‌ గెలీలీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ సంఘం భవనంపై యాంటీ ట్యాంక్ క్షిపణి దాడి జరిగినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రయోగం లెబనాన్ భూభాగం నుంచి జరిగినట్టు రెస్క్యూ సర్వీసెస్ ప్రతినిధి మాగెన్ డేవిడ్ ఆడమ్ జాకీ హెల్లర్ వెల్లడించారు. బాధితులు ముగ్గురూ కేరళ రాష్ట్రానికి చెందిన వారు. మరణించిన వ్యక్తిని కొల్లంకు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. జీవ్ ఆస్పత్రిలో అతని మృతదేహాన్ని ఉంచారు. గాయపడిన వారిని బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒక విదేశీ కార్మికుడు సైతం మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్టు సమాచారం.

లెబనాన్‌లోని షియా హిజ్బొల్లా వర్గం ఈ దాడికి పాల్పడినట్టు ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. ఈ సంస్థ ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రతిరోజూ రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజా దాడి తర్వాత ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతీకార దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్ పట్టణంలోని చిహిన్‌లో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఎటాక్ చేసినట్టు ఐడీఎఫ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు పౌరులు, 10 మంది సైనికులు మరణించినట్టు ఐడీఎఫ్ పేర్కొంది. అలాగే 229 మంది హిజ్బొల్లా మిలిటెంట్లను హతమార్చినట్టు వెల్లడించింది. అయితే వీరిలో కొంత మంది లెబనాన్‌లో, మరికొందరు సిరియాలో కూడా మరణించినట్టు తెలిపింది. కాగా, గతేడాది డిసెంబరులో గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు గిల్ డేనియల్స్ మరణించిన విషయం తెలిసిందే. భారత రాయబార కార్యాలయం గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed