King Charles Coronation | రూ.1000 కోట్లతో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. మండిపడుతున్న ప్రజలు!

by srinivas |   ( Updated:2023-05-02 13:28:51.0  )
King Charles Coronation | రూ.1000 కోట్లతో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. మండిపడుతున్న ప్రజలు!
X

దిశ వెబ్ డెస్క్ : బ్రిటన్‌ (Britain) తదుపరి రాజుగా కింగ్‌ చార్లెస్‌ ప్రమాణ స్వీకారం (King Charles Coronation) చేయనున్నారు. ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 (Elizabeth II) గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. రాణి మరణం తరువాత ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ (74) సెప్టెంబర్ 2022లో తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం మే 6న జరగనుంది. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయి. కానీ ప్రజల సొమ్ముతో ఇంత ఖర్చు పెట్టి ఒక రాచరిక కార్యక్రమం నిర్వహించడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.

రాజు పట్టాభిషేక కార్యక్రమాన్ని అపరేషన్ గోల్డెన్ ఆర్బ్ కమిటీ నిర్వహించనుంది. పట్టాభిషేకానికి దాదాపు 100 మిలియన్ పౌండ్లు ఖర్చు (భారత కరెన్సీలో రూ.1021.5 కోట్లుకు పైగా) అవుతుందని కమిటీ తెలిపింది. బ్రిటన్ దేశం ప్రస్తుతం ఆర్థిక మాంద్యం గుప్పిట్లో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రజలు మండిపడుతున్నారు. పైగా ఆ రోజు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఒక రోజు బ్యాంకులు పనిచేయకుంటే దేశానికి 2.3 బిలియన్ పౌండ్లు నష్టం.. ఇది కూడా పట్టాభిషేకం ఖర్చు కిందికే చేరుతుంది.

ఈ కార్యక్రమంలో మరో విడ్డూరం కూడా ఉంది. పట్టాభిషేకానికి ప్రజలు వచ్చి రాజు పట్ల తాము విధేయులుగా ఉంటామని ప్రమాణం స్వీకారం చేయాలట!. ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం ఉంటే.. ఇంకా రాచరికం ఆచారాలు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే పట్టాభిషేకానికి వ్యతిరేకంగా కొన్ని ప్రజా సంఘాలు అదే సమయంలో నిరసనలు చేపట్టనున్నారు.



కింగ్ చార్లెస్ సతీమణి కెమిలియా పట్టాభిషేక కార్యక్రమంలో సాధారణంగా తన అత్త క్వీన్ ఎలిజిబెత్‌-2 కిరీటాన్నే ధరిస్తారట. అందులో భారతీయ వజ్రం కొహినూర్‌ను ధరించేందుకు అమె నిరాకరించిందని సమాచారం. ఇప్పటికే భారత ప్రభుత్వం కొహినూర్ వజ్రాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలని పలుమార్లు బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత దేశంతో దౌత్య సంబంధాల దృష్ట్యా కొహినూర్ వజ్రాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం లేదని తెలిసింది. ఈ కార్యక్రమంలో భారత్ తరపున బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పాల్గొనబోతోంది.





Advertisement

Next Story