Biden : ‘అధ్యక్ష’ రేసు నుంచి వైదొలగిన బైడెన్.. ఆ ఛాన్స్ కమలా హ్యారిస్‌కేనా ?

by Hajipasha |   ( Updated:2024-07-21 19:20:56.0  )
Biden : ‘అధ్యక్ష’ రేసు నుంచి వైదొలగిన బైడెన్.. ఆ ఛాన్స్ కమలా హ్యారిస్‌కేనా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడయ్యారు. ఈమేరకు సమాచారంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బైడెన్ ఆదివారం రాత్రి ఓ లేఖను విడుదల చేశారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసమే తాను అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జూన్ 25న డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో జో బైడెన్ తడబాటుకు గురయ్యారు. ట్రంప్‌కు ధీటుగా సమాధానాలు ఇవ్వలేక వెనుకంజలో ఉండిపోయారు. అప్పటి నుంచి బైడెన్ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. ఆయనకున్న ప్రజా మద్దతు కూడా తగ్గిపోయింది. ఈ ప్రతికూల పరిణామాలతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటే సొంతపార్టీ వాళ్లే బైడెన్‌‌ను డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కొవిడ్-19 సోకడంతో గత కొన్ని రోజులుగా ఆయన ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాత ఎన్నికల బరి నుంచి గౌరవప్రదంగా తప్పుకోవడమే మేలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కమలా హ్యారిస్‌కే ఆ అవకాశాలు..

ఇటీవల డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కమలా హ్యారిస్ ఇప్పుడు దేశానికి వైస్ ప్రెసిడెంట్. వాస్తవానికి ఆమెకు ప్రెసిడెంట్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. ఏమో చెప్పలేం.. భవిష్యత్తులో ఆమే ప్రెసిడెంట్ అవుతారేమో..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గత శనివారం(జులై 21) నుంచే అమెరికాలోని పలు నగరాల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన కొందరు నాయకులు కమలా హ్యారిస్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా చెబుతూ ఎన్నికల విరాళాలు సేకరించే ప్రక్రియను మొదలు పెట్టారు. బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్‌ను బరిలోకి దింపేందుకే డెమొక్రటిక్ పార్టీ ఈవిధంగా ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనతో ట్రంప్ గ్రాఫ్ భారీగా పెరిగింది. ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు ట్రంప్‌ను ఢీకొనే చరిష్మా కలిగిన మరో నేత డెమొక్రటిక్ పార్టీకి కనిపించడం లేదు. అందుకే వైస్ ప్రెసిడెంట్‌గా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన కమలా హ్యారిస్‌కే అధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వాలని డెమొక్రటిక్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఒకవేళ అదే నిజమైతే.. తొలిసారిగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం పొందిన భారత సంతతి వనితగా కమలా హ్యారిస్ రికార్డును సొంతం చేసుకుంటారు.

Advertisement

Next Story