Hassan Nasrallah : హసన్ నస్రల్లా మృతిపై ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఏమన్నారంటే..

by Hajipasha |
Hassan Nasrallah : హసన్ నస్రల్లా మృతిపై ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఏమన్నారంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ రాజధాని బీరుట్‌‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంపై ఇరాన్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నస్రల్లా చేసిన త్యాగంతో ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కొనేందుకు హిజ్బుల్లా మరింత బలపడుతుందని ఆయన వెల్లడించారు. ‘‘జియోనిస్ట్ వెర్రి కుక్క క్రూరత్వంతో మరోసారి లెబనాన్‌లో నరమేధానికి తెగబడింది. ఇజ్రాయెల్‌కు ముందుచూపు కొరవడిన తీరుకు ఇది నిదర్శనం. ఆ దేశం మూర్ఖపు వైఖరితో ముందుకు సాగుతోంది’’ అని ఖమేనీ విమర్శించారు. గత అనుభవాలతో జియోనిస్ట్ పాలకులు ఇంకా ఏమీ నేర్చుకోలేకపోయారని మండిపడ్డారు. లెబనాన్‌లో అత్యంత బలంగా నాటుకుపోయిన హిజ్బుల్లాకు భారీ నష్టం కలిగించే సత్తా ఇజ్రాయెల్‌కు లేదన్నారు. ‘‘పశ్చిమాసియా ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన శక్తులు హిజ్బుల్లాకు మద్దతుగా నిలవాలి. జియోనిస్ట్ పాలనలోని తీవ్రవాద ముఠా గాజాలో గత ఏడాదిగా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. ఆ తప్పుల నుంచి నేటికీ ఏమీ నేర్చుకోలేదు. మహిళలు, పిల్లలు, పౌరుల మారణకాండ మిగిల్చే విషాదం గురించి అర్థం చేసుకోలేదు. బలమైన ప్రతిఘటన నిర్మాణాన్ని వారు దెబ్బతీయలేరు’’ అని ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న లెబనాన్‌ ప్రజలకు సంఘీభావంగా ఉండాలని ప్రపంచ ముస్లిం సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. ‘‘లెబనాన్ ప్రజలకు, హిజ్బుల్లాకు అన్ని మార్గాల్లో అండగా నిలవండి. దుర్మార్గపు ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయడం ముస్లింలందరి బాధ్యత’’ అని ఖమేనీ పేర్కొన్నారు.

జాతీయ భద్రతా మండలితో ఖమేనీ భేటీ

ఇరాన్ జాతీయ భద్రతా మండలితో ఖమేనీ భేటీ అయ్యారు. హసన్ నస్రల్లా మరణించిన నేపథ్యంలో లెబనాన్‌లో హిజ్బుల్లాకు ఏవిధమైన మద్దతును అందించాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. కాగా, ఇజ్రాయెల్‌ సైన్యం దూకుడును ప్రదర్శిస్తున్న వేళ ఇరాన్ అలర్ట్ అయింది. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయనకు భద్రతను పెంచారు.

Advertisement

Next Story

Most Viewed