భారత్ ఎన్నికల వ్యవస్థ భేష్: పాక్ ప్రతిపక్ష నేత ప్రశంసలు

by vinod kumar |
భారత్ ఎన్నికల వ్యవస్థ భేష్: పాక్ ప్రతిపక్ష నేత ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై పాకిస్థాన్ ప్రతిపక్ష నేత సయ్యద్ షిబ్లీ ఫరాజ్ ప్రశంసలు కురిపించారు. తమ దేశంలోనూ ఇలాంటి ప్రక్రియ జరగాలని ఆకాంక్షించారు. పాకిస్థాన్ సెనేట్‌లో ఆయన గురువారం మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని భారత్‌లో ఒక్క గొంతు కూడా ప్రశ్నించలేదన్నారు. ఇది వారికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ‘నేను మన శత్రు దేశాన్ని ఉదాహరణగా చెప్పదలచుకోలేదు. కానీ ఇటీవల అక్కడ ఎన్నికలు జరిగాయి. 800 మిలియన్లకు పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, కొన్నిచోట్ల ఒక ఓటరు కోసం కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు ఈవీఎంల సాయంతో కసరత్తు చేశారు. కానీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒక్కరు కూడా ఆరోపించలేదు’ అని వ్యాఖ్యానించారు.

‘ఎంతో స్వేచ్ఛా వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. పాకిస్థాన్‌లోనూ ఇలాంటి తరహా ఎన్నికలు జరగాలి’ అని తెలిపారు. కానీ పాక్ పోల్స్‌లో ఓడిపోయిన వారు ఒప్పుకోరు. విజేత కూడా అతని స్వంత ఇష్టానుసారం ఎన్నికవుతారు. ఈ రకమైన విధానం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది’ అని చెప్పారు. పాక్ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కాగా, ఇటీవల పాక్ రాయబారి హుస్సేన్ హక్కానీ సైతం భారత ఎన్నికలను, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్య పరిమాణాన్ని చూసి ముగ్ధులవ్వకపోవడం కష్టమని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed