భారత్ చంద్రుడిపై అడుగుపెట్టింది..కానీ మనం మాత్రం?: పాక్ చట్టసభ సభ్యుడి ప్రసంగం వైరల్

by samatah |
భారత్ చంద్రుడిపై అడుగుపెట్టింది..కానీ మనం మాత్రం?: పాక్ చట్టసభ సభ్యుడి ప్రసంగం వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన విషయం తెలిసిందే. అయితే అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ పార్లమెంటులో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ మేరకు ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎంపీ) పార్టీ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్ చంద్రునిపై కాలు మోపడంతో సహా అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుంటే..పాక్‌ మాత్రం మురుగు కాలువల్లో పడి చనిపోతున్న అమాయక పిల్లల మరణాలను కూడా ఆపలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘భారత్‌కు చెందిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ అనే వార్తలను టీవీల్లో చూశాం. కానీ ఇది జరిగిన కేవలం రెండు సెకన్ల తర్వాత కరాచీలో కాలువలో పడి పిల్లలు మరణించిన వార్తలు ప్రసారమయ్యాయి’ అని తెలిపారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తోందని చెప్పారు. అలాగే దాదాపు 20.3 మిలియన్ల మంది ప్రజలు నివసించే కరాచీ నగరంలో మంచినీటి కొరతపై కూడా కమల్ ప్రస్తావించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ప్రధాన ఆధాయ వనరు. ఈ ప్రాంతంలో రెండు ఓడరేవులు సైతం ఉన్నాయి. ఇది దేశం మొత్తానికి ప్రవేశ ద్వారంగా ఉంది. కానీ 15ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు తాగునీరు కూడా అందడం లేదు. ఎప్పుడో ఒకసారి ట్యాంకర్ వస్తే అది మాఫియా గుప్పిట్లోనే ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

కరాచీ రాజధానిగా ఉన్న సింధ్ ప్రావిన్స్‌లో 70 లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని, అంతేగాక దేశ వ్యాప్తంగా 2.6 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదని చెప్పారు. భారత్ నేడు అభివృద్ధి చెందుతోందంటే ఆ దేశ ప్రజలకు అందించిన విద్య వల్లనేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాలు ఉద్యోగం లేని యువతను ఉత్పత్తి చేసే పరిశ్రమలుగా మారాయని చెప్పారు. ఈ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story