US Presidential nominee: తల్లితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమలాహ్యారిస్

by Shamantha N |
US Presidential nominee: తల్లితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమలాహ్యారిస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కమలా హ్యారిస్ డెమొక్రటిక్ అభ్యర్థిగా నామినేషన్ స్వీకరించిన తర్వాత తల్లిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మనమేంటో చెప్పొద్దు.. చేసి చూపించాలి’ అని తల్లి డా. శ్యామలా గోపాలన్ హ్యారిస్ చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. తన తల్లి జీవిత ప్రయాణం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని గుర్తుచేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్‌ పార్టీ (Democratic Party) నేషనల్ కన్వెన్షన్ లో కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తల్లిగురించి కమలా ఏమన్నారంటే?

‘‘రొమ్ము క్యాన్సర్ ను నయం చేసే సైంటిస్టు కావాలని మా అమ్మ కల. అదే లక్ష్యంతో 19 ఏళ్ల వయసులో సప్తసముద్రాలు దాటి భారత్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికెళ్లి పెళ్లి చేసుకోవాల్సింది. కానీ, తలరాత మాత్రం వేరేగా ఉంది. జమైకాకు చెందిన డొనాల్డ్‌ హ్యారిస్‌ తో మా అమ్మకు పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన జీవితం, భవిష్యత్తుపై మా అమ్మ ఎప్పుడూ సొంత నిర్ణయాలే తీసుకునేది. నన్ను, చెల్లి మాయను కూడా అలాగే తీర్చిదిద్దింది’’ అని కమలా తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.‘‘అన్యాయం గురించి ఫిర్యాదు చేయడం కాదు.. చేతనైతే అలా జరకుండా ఏదైనా చేయాలి అని మా తల్లి నేర్పింది. ఏపనిని సగంలో పూర్తి చేయొద్దని సూచించింది. మా అమ్మను రోజూ మిస్ అవుతూంటా. ఇప్పుడు ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారు. ఆమె పైనుంచి నన్ను చూస్తూ నవ్వుతూ ఉంటారని ఆశిస్తున్నా’’ అని కమలాహారిస్‌ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. "అందరూ వర్కింగ్ పేరెంట్స్ లానే మా అమ్మ కూడా మమ్మల్ని పెంచేందుకు చాలా కష్టపడ్డారు. రక్తసంబంధం ద్వారా కాదు.. ప్రేమ ద్వారానే కుటుంబం ఏర్పడుతుందని ఆమె నిరూపించారు” అని హ్యారిస్ తెలిపారు.

శ్యామలా గోపాలన్ ఎవరంటే?

ఇకపోతే, కమలా తల్లి తండ్రితో విడిపోయినప్పటినుంచి తల్లి దగ్గరే పెరిగారు. కమలాహ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలే. తమిళనాడుకు చెందిన ఆమె 1958లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లారు. 25 ఏళ్ల వయసులో డాక్టరేట్‌ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు జరిపారు. 1963లో డొనాల్డ్‌ హారిస్‌ను వివాహం చేసుకున్నారు. కమలా హారిస్‌ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియామకం అయ్యే ఏడాదికి ముందే క్యాన్సర్ తో ఆమె చనిపోయారు.

Advertisement

Next Story

Most Viewed