USA: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరిక కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
USA: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరిక కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటే వారు కూడా టార్గెట్ గా మారినట్లే అని వైట్‌హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి జాన్‌కిర్బీ వెల్లడించారు. కిమ్‌ సైన్యం మద్దతు తీసుకోవడం క్రెమ్లిన్‌ అసమర్థతను తెలియజేస్తోందని చురకలు అంటించారు. ‘‘రష్యా-ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నాం. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా కిమ్‌ సైన్యం పోరాడితే సహించేది లేదు. వారిని కూడా కీవ్‌ సైనికులుగానే భావిస్తామని గతంలోనే చెప్పాను. నార్త్ కొరియాలోని వాన్సాన్‌ అనే ప్రాంతం నుంచి సైనికులు సముద్రమార్గం ద్వారా రష్యాలోని వ్లాదివాస్తోక్‌ చేరుకొంటున్నారు. అక్కడినుంచే మిలటరీ ట్రైనింగ్‌ సెంటర్లకు వెళుతున్నారు. ఇప్పడు వారికి శిక్షణ జరుగుతోంది. అయితే, కిమ్ సైన్యాన్ని ఎక్కడ వాడుకుంటారనే దానిపై స్పష్టత రాలేదు’’ అని కిర్బీ అన్నారు.

యుద్ధంలో నార్త్ కొరియా సైనికులు..!

ఇకపోతే, రష్యన్లతో పాటు నార్త్ కొరియా సైనికులు కూడా రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని కిర్బీ అన్నారు. నార్త్ రష్యాలోని ఉక్రెయిన్‌ సరిహద్దులకు ఆ సైనికులు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. పరిస్థితిని గమనిస్తున్నమని అన్నారు. వారు యుద్ధంలో పాల్గొంటే అది రష్యా నిరాశ, నిస్పృహను తెలియజేస్తుందన్నారు. ఈ యుద్ధంలో రష్యా దెబ్బతిన్నప్పటికీ.. పుతిన్ యుద్ధాన్ని కొనసాగించేలా కన్పిస్తున్నారని మండిపడ్డారు. నార్త్ కొరియా సైన్యానికి రష్యా సహాయం అందించడం కూడా ఐక్యరాజ్యసమితి ఆంక్షల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా మరో 1500 మంది సైనికులను తరలించిందని బుధవారం దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ చావోతాయ్‌ యంగ్‌ తెలిపింది. డిసెంబర్‌ నాటికి 10 వేల మంది సైన్యాన్ని పంపేందుకు కిమ్ ప్రణాళికలు వేస్తున్నట్లు పేర్కొంది.


Advertisement

Next Story