దుబాయ్‌లో కుంభవృష్టి.. స్కూల్స్, ఆఫీసులు బంద్.. పలు విమానాలు రద్దు

by Disha Web Desk 17 |
దుబాయ్‌లో కుంభవృష్టి.. స్కూల్స్, ఆఫీసులు బంద్.. పలు విమానాలు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీవ్ర వర్షాలతో అల్లాడిపోతోంది. గత నెలలో భారీ వర్షాలతో వణికిపోయిన దేశం మరోసారి గురువారం కూడా కుంభవృష్టి వర్షంతో అల్లకల్లోలం అయింది. బుధవారం రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో కూడా వర్షాలు కురవడం ప్రారంభం కాగా అది, గురువారం వరకు తీవ్రం కావడంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలలోపు 50 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది.


రోడ్లపై వరద పారుతుండటంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ఆఫీసులను మూసివేశారు. అలాగే, దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 13 విమానాలను రద్దు చేయగా, ఐదు విమానాలను దారి మళ్లించింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.డ్రైనేజీల్లోకి భారీగా నీరు చేరుతుండటంతో అవి పొంగిపోర్లుతున్నాయి. వర్షాలు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇంతకుముందు ఏప్రిల్ 14-15 తేదీల్లో UAEని భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా, నెలరోజుల్లోపే మరోసారి కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలతో ఉండే దేశంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రపంచ దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed