సిడ్నీలో అందుబాటులోకి డ్రైవర్‌లెస్ మెట్రోరైలు

by Maddikunta Saikiran |
సిడ్నీలో అందుబాటులోకి డ్రైవర్‌లెస్ మెట్రోరైలు
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం సిడ్నీలో ప్రయాణికుల కోసం డ్రైవర్‌లెస్ మెట్రోరైలును అధికారికంగా ప్రారంభించారు. సిడ్నీ మెట్రో సిటీ లైన్‌లో మొదటి సర్వీస్ ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 4:54 గంటలకు సిడెన్‌హామ్ స్టేషన్ నుండి బయలుదేరిన ఈ డ్రైవర్ లెస్ రైలు 5:16 గంటలకు చాట్స్‌వుడ్‌కు చేరుకుంది. డ్రైవర్‌లెస్ మెట్రోరైలు మొదటి సర్వీస్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు సోమవారం తెల్లవారుజామున 1 గంటల నుండి క్యూలో ఉన్నారు. కాగా డ్రైవర్‌లెస్ మెట్రో రైలు మొదట ఆగస్టు 4న ప్రారంభించాలని నిర్ణయించారు, అయితే సేఫ్టీ రెగ్యులేటర్ అనుమతుల కారణంగా ప్రారంభం వాయిదా పడింది. ఈ మెట్రో రైళ్లు రోజూ ఉదయం, సాయంత్రం ప్రతి నాలుగు నిమిషాలకు, అలాగే రాత్రి మరియు వీకెండ్స్ లో ప్రతి 10 నిమిషాలకు నడుస్తాయి.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం (NSW) అంచనా ప్రకారం ఈ రైలు వీకెండ్ రోజున గరిష్ఠంగా 2,50,000 మంది ప్రయాణీకులను తీసుకువెళుతుంది,అలాగే సెంట్రల్ సిడ్నీలోని సిడెన్‌హామ్ నుండి బరంగారూకు వెళ్లే వారికి ఈ మార్గం 27 నిమిషాల పాటు సమయం ఆదా చేస్తుంది.కాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి 21.6 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ($14.4 బిలియన్) ఖర్చు అయ్యింది. దీంతో ఇది ఆస్ట్రేలియా చరిత్రలో అతిపెద్ద ప్రజా రవాణా ప్రాజెక్ట్‌గా నిలిచింది.NSW యొక్క రవాణా మంత్రి జో హేలెన్ మాట్లాడుతూ.. "ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైలు అందుబాటులోకి రావడం నగర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ,ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు కొత్త స్టేషన్‌లు నిర్మించామని వెల్లడించారు. అలాగే ప్రస్తుత సెంట్రల్ మరియు మార్టిన్ ప్లేస్ స్టేషన్‌లకు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేశామని, తల్లావాంగ్ నుండి చాట్స్‌వుడ్ వరకు ఉన్న మిగతా 36 కి.మీ. లైన్ ను 2025 సంవత్సరం కల్లా అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Next Story

Most Viewed