China: ఇకపై చైనాలో పెళ్లి సులువు.. కానీ విడాకులు కష్టం

by Harish |   ( Updated:2024-08-15 09:26:12.0  )
China: ఇకపై చైనాలో పెళ్లి సులువు.. కానీ విడాకులు కష్టం
X

దిశ, నేషనల్ బ్యూరో: జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదు అవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం వివాహ చట్టాల్లో పలు మార్పులు తీసుకురాబోతుంది. వివాహ నమోదును సులభతరం చేయడంతో పాటు విడాకులు తీసుకోవడాన్ని కష్టతరం చేసేలా సవరించిన కొత్త ముసాయిదా చట్టాన్ని చైనా రూపొందించింది. ఈ కొత్త ప్రతిపాదిత చట్టంలో విడాకులను తగ్గించడానికి 30-రోజుల కూలింగ్ పీరియడ్‌ అందిస్తున్నారు, ఈ సమయంలో భార్యా భర్తలు ఇద్దరిలో ఎవరైనా ఒకరు విడాకులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే, వారు దరఖాస్తును ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత విడాకుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేస్తారు.

మరో ప్రతిపాదనలో వివాహాలను రిజిస్ట్రర్ చేయడానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతీయ పరిమితులను తొలగించింది, ఇకపై వివాహాలకు హౌస్‌హోల్డ్‌ రిజిస్ట్రర్‌ అవసరం లేదని పేర్కొంది. చైనా తెస్తున్న ఈ కొత్త సవరణల ద్వారా వివాహం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, అదే విడాకులు తీసుకోవడం మాత్రం కష్టం అవుతుంది. కుటుంబ స్నేహపూర్వక సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ డ్రాఫ్ట్‌పై ప్రజలు తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి అందించవచ్చు, ఈ అవకాశం సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది.

చైనా ప్రభుత్వ అధికారులు అక్కడి మీడియాతో మాట్లాడుతూ, ఈ చట్టాల వలన, వివాహం, కుటుంబం ప్రాముఖ్యతను ప్రోత్సహించినట్లవుతుంది, అలాగే, విడాకులను తగ్గించడం, సామాజిక స్థిరత్వాన్ని సమర్థించడం, వివాహాల పట్ల చట్టబద్ధమైన హక్కులను మెరుగ్గా రక్షించడం సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో వివాహం చేసుకున్న చైనా జంటల సంఖ్య అంతకు ముందు సంవత్సరం నుండి 4,98,000 తగ్గి 34.3 లక్షలకు పడిపోయింది, ఇది 2013 నుండి చూసినట్లయితే చాలా అత్యల్పంగా ఉంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగించడంతో ఉద్యోగ భద్రత, భవిష్యత్తు దృక్పథంపై ఆందోళనల కారణంగా చాలా మంది చైనా యువత ఒంటరిగా ఉండటానికి లేదా వివాహాన్ని వాయిదా వేయడాన్ని ఎంచుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed