CANADA : కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం..తాత్కాలికంగా నివాసం ఉంటున్న విదేశీ విద్యార్ధులపై బహిష్కరణ వేటు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-08-27 19:59:15.0  )
CANADA : కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం..తాత్కాలికంగా నివాసం ఉంటున్న విదేశీ విద్యార్ధులపై బహిష్కరణ వేటు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాకు వలస వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే క్రమంలో ట్రూడో ప్రభుత్వం కొత్త ఫెడరల్ పాలసీ తీసుకొచ్చింది. తాత్కాలిక వీసాపైన నివాసముంటూ తక్కువ వేతనంకి పని చేసే విదేశీ విద్యార్థులను రాబోయే రోజుల్లో దేశం నుండి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని ట్రూడో మరోమారు పేర్కొన్నారు. దీంతో 70,000 వేల మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్తులు ప్రమాదంలో పడబోతున్నాయని అంచనా. ఈ నిర్ణయంపై భారతీయ విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ తో పాటు, అంటారియో, మానిటోబా, బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లలో నిరసన ర్యాలీలు చేపట్టారు.

ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ (ESDC) ప్రకారం, 2023లో కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు 1,83,820 తాత్కాలిక వీసాలు మంజూరు చేసింది. దీంతో కెనడాకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో కెనడాలో రోజురోజుకి నిరుద్యోగం పెరిగిపోతోంది. అలాగే ఇళ్ల కొరత వంటి సమస్యలు సంక్షోభ స్థాయికి చేరుకుంటుండటంతో వలసలకు బ్రేక్ వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రూడో వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల నుంచి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణం , ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు మినహాయింపునిస్తామని ప్రధాని ట్రూడో తెలిపారు. అలాగే పర్మినెంట్ రెసిడెన్స్ వీసాలకు అనుమతుల్లోనూ మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story