Sheikh Hasina : ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా.. ఘజియాబాద్‌‌ సైనిక స్థావరంలో ల్యాండింగ్

by Hajipasha |
Sheikh Hasina : ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా.. ఘజియాబాద్‌‌ సైనిక స్థావరంలో ల్యాండింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా(76) తన పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆ దేశం విడిచి సైనిక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. హసీనా తన సోదరి షేక్‌ రెహానాతో కలిసి బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన లాక్‌హీడ్ సీ-130జే హెర్క్యులస్ విమానంలో సోమవారం సాయంత్రం 5.36 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిండాన్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఆమెను ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ) సంజయ్ చోప్రా రిసీవ్ చేసుకున్నారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి గజియాబాద్‌కు చేరుకునే వరకు హసీనా విమానం కదలికలను భారత వాయుసేన, భద్రతా సంస్థలు నిశితంగా పరిశీలించాయి. అంతకుముందు షేక్ హసీనా బెంగాల్‌లో ల్యాండ్ అవుతారనే ప్రచారం జరిగింది. ఆమె విమానం జార్ఖండ్ మీదుగా వెళ్లిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. చివరకు ఆమె ఘజియాబాద్‌లో ల్యాండ్ అయ్యారనే విషయంపై క్లారిటీ వచ్చింది. తదుపరిగా భారత్ నుంచి షేక్ హసీనా లండన్‌కు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. తీవ్ర ఆందోళనలతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో షేక్ హసీనా ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అక్కడి ఆర్మీ సూచించింది. దీంతో ఆమె ఆగమేఘాల మీద దేశం విడిచి భారత్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

బార్డర్‌లో అలర్ట్

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్) అలర్ట్ అయింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంట హై అలర్ట్‌ ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు బీఎస్‌ఎఫ్‌ డీజీ కోల్‌కతాకు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారత రైల్వే ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed