Paris Olympics: కొద్ది గంటల్లో పారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యే వేళ.. రైల్వే నెట్‌వర్క్‌పై దాడి

by Harish |
Paris Olympics: కొద్ది గంటల్లో పారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యే వేళ.. రైల్వే నెట్‌వర్క్‌పై దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రఖ్యాత ఒలింపిక్స్ 2024 వేడుకలకు పారిస్‌ నగరం సర్వాంగ సుందరంగా సిద్దమైంది. మరికొద్ది గంటల్లో పోటీలు ప్రారంభమయ్యే ముందు అక‌స్మాత్తుగా ఫ్రెంచ్ రైల్వే నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎవరో కావాలనే రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన హై-స్పీడ్ నెట్‌వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. ప్రధానంగా మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం రోజున దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే కొన్ని మార్గాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని స్టేషన్లలో ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. చాలా రైళ్లను రద్దు చేశారు. పొరుగున ఉన్న బెల్జియం, ఇంగ్లీష్ చానల్ కింద లండన్ వెళ్లే మార్గాలు కూడా దెబ్బతిన్నాయి.

ఉత్తరాన లిల్లే, పశ్చిమాన బోర్డియక్స్, తూర్పున స్ట్రాస్‌బర్గ్ వంటి నగరాలతో పారిస్‌ను కలిపే మార్గాలను లక్ష్యంగా చేసుకుని లైన్లను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే ఆపరేటర్ తెలిపింది. ప్రయాణికులందరూ తమ ప్రయాణాలను వాయిదా వేయాలని అధికారులు కోరారు. ప్రస్తుతం త్వరతగిన మరమ్మతులు జరుగుతున్నాయి. పునరుద్దరణకు మరి కొద్ది రోజుల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. అయితే ఒలింపిక్స్ ప్రారంభం రోజున ఇలా జరగడం వలన వేడుకలను చూడటానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రవాణా మంత్రి ప్యాట్రిస్ వెర్గ్రిట్ ఈ చర్యలను నేరంగా అభివర్ణించారు. రాజధానిలోని ప్రధాన స్టేషన్లలో భద్రతను మరింత పెంచుతున్నట్లు పారిస్ పోలీసు చీఫ్ తెలిపారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.



Next Story